కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో నవంబర్ 17,18 తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్ష కొరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ... గ్రూప్-3 పరీక్ష కొరకు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ కేంద్రాలలో పూర్తి స్థాయి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను బుధవారం ఆదేశించారు.
పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు త్రాగునీరు, ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, పరీక్షకు అవసరమైన ఫర్నిచర్, వెలుతురు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, ప్రహరీ గోడకు అనుకొని ఉన్న గదుల కిటికీలను మూసి ఉంచాలన్నారు. విద్యుత్ లో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని, పరీక్ష కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.