calender_icon.png 24 February, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి

24-02-2025 08:22:16 PM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..

నిజామాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 27న (గురువారం) ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.

జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్నిసంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతించడం, షిఫ్ట్‌ల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.