అంటిగ్వా: పొట్టి ప్రపంచకప్‌లో జోరు మీదున్న టీమిండియా ఒక్క రోజు వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్ భాగంగా గ్రూప్ నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్తు దక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అఫ్గాన్‌పై భారీ విజయంతో టీమిండియా జోష్‌లో కనిపిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టీమిండియా దాదాపు సెమీస్ చేరనట్లే కాగా.. ఇప్పటికే ఒక పరాజయం మూటగట్టుకున్న బంగ్లా.. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఇంటి బాట పట్టనుంది. ఈ నేపథ్యంలో కడవరకు కొట్లాడేందుకు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి.
దూబేపైనే దృష్టి..
ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగం బలం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది. లీగ్ దశను మన జట్టు న్యూయార్క్‌లో ఆడడంతో బ్యాటింగ్ పవర్ పెద్దగా తెలియలేదు. అయితే సూపర్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ లోపాలు బయటపడ్డాయి. లీగ్ దశలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆఫ్‌స్టంప్ బలహీనతను బయటపెడుతూ రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. అయితే హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఇక ఓపెనర్‌గా వస్తున్న విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో కాస్త పర్వాలేదనిపించాడు.
గ్రూప్ దశ మ్యాచ్‌లతో పోలిస్తే కోహ్లీ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కాస్త స్వేచ్ఛగా ఆడినట్లు కనిపించింది. అయితే రోహిత్, కోహ్లీలు వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టుకు శుభారంభం అందించడం కీలకం. వన్‌డౌన్‌లో రిషబ్ పంత్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వచ్చీ రావడంతోనే ధాటిగా ఆడడానికే ఇష్టపడుతున్న పంత్ బంతిని యథేచ్చగా బౌండరీలకు తరలించడంలో సఫలీకృతమవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో అర్థశతకంతో అదరగొట్టాడు. అతను ఫామ్‌లో ఉంటే ఆపడం ఎవరి తరం కాదు. అయితే హిట్టర్‌గా జట్టులోకి వచ్చిన శివమ్ దూబే విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్లో అలవోకగా సిక్సర్లు బాదిన దూబే ఇక్కడ మాత్రం నిరాశపరుస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ దూబే విఫలమైతే సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాణిస్తుండడం సానుకూలాంశం. ఐపీఎల్లో విఫలమైనప్పటికీ టీమిండియా జెర్సీకి మారిన వెంటనే పాండ్యా తన ఆటతీరును పూర్తిగా మార్చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
మరో ఆల్‌రౌండర్ జడేజా బంతితో రాణిస్తున్నప్పటికీ బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది. అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో.. బంతితో మెరుస్తున్నాడు. ఇక టీమిండియా బౌలింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యాలతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తుండగా.. కుల్దీప్, అక్షర్, జడేజాల త్రయం తమ స్పిన్ అస్త్రంతో వికెట్లు పడగొడుతున్నారు.
ఒత్తిడిలో బంగ్లాదేశ్..
ఈసారి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సీనియర్లనే ఎక్కువగా నమ్ముకుంది. ఆసీస్‌తో సూపర్ పోరులో బ్యాటింగ్‌లో బంగ్లా పూర్తిగా తేలిపోయింది. సీనియర్లు షకీబ్, మహ్మదుల్లా రాణించడంపైనే జట్టు ఆధారపడుతోంది. తౌహిద్ హ్రుదోయ్ బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నాడు. మిగతావారు మాత్రం విఫలమవ్వడం బంగ్లాను ఆం దోళన కలిగిస్తోంది. అయితే బౌలింగ్‌లో మాత్రం కాస్త బలంగానే ఉంది. తంజీమ్, ముస్తాఫిజుర్, రిషద్, షకీబ్‌లు తమ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇరుజట్ల ముఖాముఖిలో టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం. 13 సార్లు తలపడితే భారత్ 12సార్లు నెగ్గగా.. బంగ్లాదేశ్ ఒకసారి మాత్రమే విజయాన్ని అందుకుంది.