15-03-2025 11:50:16 PM
మనకొండూర్,(విజయక్రాంతి): విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. రాష్ట్రీయ బాల స్వాస్తియ కార్యక్రమం ద్వారా అలుగునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న 72 మంది విద్యార్థులను గుర్తించి వారికి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. అలుగునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రంలో శనివారం నిర్వహించిన ఈ కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ పట్టుదల, ఏకాగ్రతతో చదవాలని అన్నారు. విద్యతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సూచించారు. పాఠశాలలో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సబ్జెక్టు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను మళ్లీ మళ్లీ అడగాలని, వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి షాజిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ సుజాత, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.