- నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల మూడో వన్డే
బెంగళూరు: సఫారీలతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా టీమిండియా మహిళల జట్టు సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2 కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. బెంగళూరు వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో వన్డే ఆడనుంది. ఇప్పటికే సిరీస్ నెగ్గిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీనస్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. సెంచరీల మోత మోగుతున్న చిన్న స్వామి స్టేడియంలో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.
బ్యాటింగ్ విభాగంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధన సూపర్ ఫామ్‌లో ఉంది. రెండు వరుస శతకాలతో అదరగొట్టిన స్మృతి మూడో సెంచరీపై కన్నేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా తన ఫామ్‌పై వస్తున్న సందేహాలను పటాపంచలు చేస్తూ రెండో వన్డేలో మెరుపు శతకంతో అదరగొట్టింది. షఫాలీ వర్మ, హేమలత, రోడ్రిగ్స్, రిచా ఘోష్ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్, ఆశా శోభన ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు మరోసారి కీలకం కానున్నారు. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన సఫారీ అమ్మాయిలు చివరి వన్డేలో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్నారు.