calender_icon.png 10 November, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సీటుపై కన్ను

09-09-2024 12:00:00 AM

  1. మద్దతు తెలుపుతూనే బయట అసత్య ప్రచారాలు 
  2. ఇటీవలే ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం 
  3. ఢిల్లీలోనూ లాబీయింగ్ చేస్తోన్న పలువురు నేతలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ముడా, వాల్మికీ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీటుపై పార్టీ సీనియర్ నేతల కన్ను పడింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)లో స్థలం కేటాయింపు కేసులో విచారణకు రావాలని గవర్నర్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. దీన్ని అదనుగా భావించిన కొందరు సీనియర్ నేతలు సీఎం కుర్చీపై కన్నేశారు.

సిద్ధరామయ్య తర్వాత సీఎం ఎవరు అవుతారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఎంబీ పాటిల్ ప్రకటన చేయగా ఆర్వీ దేశ్‌పాండే సీఎం కావాలనే తన కోరికను శివానంద్ వెల్లడించారు. 

మాటల యుద్ధం

ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. సీఎం ఎంపికలో సీనియారిటీ ముఖ్యం కాదు. పార్టీలో నాకన్నా సీనియర్లు ఉన్నా ఇప్పుడు సీఎంను మార్చాల్సిన అవసరం లేదు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని పేర్కొన్నారు. కాగా, ఎంబీ పాటిల్ అభ్యర్థిత్వంపై శివానంద్‌ను ప్రశ్నించగా.. ఆయన కంటే సీనియర్లు ఉన్నారని, వారికి అవకాశమివ్వాలని సూచించారు. దేశ్‌పాండే అయితే తాను మద్దతిస్తానని వెల్లడించారు. దేశ్‌పాండే కూడా ఇటీవల సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సిద్ధరామ య్య.. సీఎం ఎంపికను ఎమ్మెల్యేలు, అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. 

ఢిల్లీలోనూ లాబీయింగ్

కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గతంగా కొత్త సీఎంపై చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నప్పటికీ ఆయనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో దించేసే అవకాశముందని ఊహాగానాలు మొదలయ్యాయి. తర్వాత సీఎం ఎవరు అవుతారని పలువురు సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. పాటిల్, శివానంద్ మధ్య మాటల యుద్ధం కూడా దీన్నే ధ్రువీకరిస్తోంది.

కాగా, కాంగ్రెస్‌లో మరోవర్గం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎంకు వ్యతిరేకంగా వస్తోన్న ఆరోపణల వెనుక డీకే హస్తమున్నట్లు వార్తలు వచ్చాయి. డీకేఎస్‌తో పాటు హోంమ ంత్రి పరమేశ్వర, పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్ఖిహోళి సైతం పోటీలో ఉన్నారు. వీరు ఇటీవలే ఢిల్లీకి లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలను బీజేపీ అవకాశంగా తీసుకుంది. నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఎత్తిచూపిస్తూ విమర్శలు చేస్తోంది. సీఎం సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని, మరికొన్ని రోజుల్లో ఇది తారస్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. పైకి మాత్రం సిద్ధరామయ్య వెంటే ఉంటామని చెబుతున్న నేతలు ఆయనపై బయట అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జగదీశ్ షెట్టర్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

ఏంటీ ముడా స్కాం?

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములను ముడా స్వాధీనం చేసుకుని మరో చోట స్థలాలు మంజూరు చేసింది. అయితే, స్వాధీనం చేసుకున్న స్థలాల కన్నా మంజూరు చేసిన భూముల విలువ అధికమని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో విచారణ చేపట్టాలంటూ ఓ ఆర్టీఐ కార్యకర్త గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్‌కు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణకు హాజరు కావాలంటూ సీఎంకు నోటీసులు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.