calender_icon.png 13 January, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్లు చెదిరే ‘రత్న భండార్’!

11-07-2024 01:27:33 AM

  1. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న సంపద గది
  2. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ అధ్యయనం.. పర్యవేక్షణ
  3. 14వ తేదీన తెరిపించాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు

భువనేశ్వర్, జూలై 10: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి సంపద లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. 12వ శతాబ్దానికి చెందిన ఈ నిధి కేంద్రాన్ని తెరిచి అందులోని సంపద పరిస్థితిని అంచనా వేయాలని ఒడిశా ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ బుధవారం సమావేశమై ఈ నెల 14న రత్నభంఢార్‌ను తెరువాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. రత్నభండార్‌ను చివరిసారి 1978లో లెక్కించారు. నాడు  సంపదను 70 రోజలు లెక్కించినా ఒడువకపోవటంతో మధ్యలోనే లెక్కింపు ఆపేసి మళ్లీ తాళం వేశారు. 

అంతుచిక్కని నిధి 

జగన్నాథుడి రత్నభండార్‌కు శతాబ్దాల చరిత్ర ఉన్నది. ఒడిశాను ఏలిన రాజులు 12వ శతాబ్దంలోనే తమ ఇలవేల్పులకు లెక్కకు మిక్కిలి సంపదను సమర్పించినట్టు ఆధారాలున్నాయి. కాలక్రమంలో అనేమంది రాజులు అత్యంత అరుదైన వజ్రవైఢూర్యాలు, ఆభరణాలు సమర్పించటంతో వాటన్నింటినీ రత్నభండార్‌లో భద్రపరిచారు. ఈ నిధి మొత్తం ఏడు గదుల్లో ఉంటుంది. శ్రీ జగన్నాథ్ టెంపుల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) ప్రకారం ప్లాట్ నంబర్ 5, 6లోని ఏడు గదుల్లో ఈ నిధి ఉన్నది. 

70 రోజులు లెక్కింపు

5, 6 ప్లాట్లలో ఉన్న రత్నభండార్ మొత్తం ఏడు గదులతో ఉంటుందని జగన్నాథ ఆలయ నిపుణుడు పండిట్ సూర్యనారాయణ రథ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఇందులో మూడు గదులను మాత్రమే వాడుతున్నారు. ఈ మొత్తాన్ని బితర్ భండార్ (లోపలి గది), బహర భండార్ (బయటి గది) అని విభజించారు. ఆ గదుల్లో వజ్ర, వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని భావిస్తున్నారు.

12 శతాబ్దంలో గాంగ వంశ రాజు అనంత వర్మన్ చోడగాంగ ఈ ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచే భక్తులు, రాజులు, సామంతులు కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు. 1952 నాటి శ్రీమందిర్ ఆర్‌వోఆర్-4 ప్రకారం రత్నభండార్‌లో 150 రకాల ఆభరణాలు ఉన్నాయి. ఇందులోని హరిదకంటి మలస్ అనే కంఠాభరణమే 120 తులాలు ఉంటుందట. మదాల పంజిక ప్రకారం అనగ భీమదేవ్ అనే రాజు ఆలయానికి 2.5 లక్షల మాధాల బంగారం సమర్పించి ఆభరణాలు చేయించాలని ఆదేశించారట. ఒక మాధాల అంటే 5.8319 గ్రాములు. అంటే లక్షా 25 వేల తులా బంగారం ఆయన ఆలయానికి సమర్పించారు.  సూర్య వంశీయులు కూడా లెక్కలేనంత సంపదను సమర్పించారు. 

పాముల బుసలు

రత్నభండార్‌లోని సంపదతోపాటు గదుల పరిస్థితిని పరిశీలించేందుకు భారత పురావస్తు శాఖ అధికారులు 1964లో ఒకసారి, 1984లో మరోసారి రత్నభండార్ గదులను తెరిచారు. అయితే, వాళ్లు గదుల తాళాలు తీయగానే లోపలి నుంచి కాల సర్పాల బుసలు పెద్ద ఎత్తున వినిపించాయట. దీంతో భయపడిపోయిన అధికారులు వెంటనే తాళాలు వేసి వెళ్లిపోయారట. రత్నభండార్‌లోకి వెళ్లేందుకు ముగ్గురికి మాత్రమే అర్హత ఉన్నది. ఒకరు పూరీ గజపతి రాజవంశీయులు, రెండోది ఆలయ కమిటీ అధికారి, మూడోవారు భండార్ మెకప్. రత్నభండార్ ప్రధాన ద్వారపు తాళం చెవులు కూడా మూడు ఉంటాయి. పై ముగ్గురి వద్ద ఒక్కోటి ఉంటాయి. అయితే, ఈ రత్నభండార్‌ను తెరువటం అనర్ధాలకు దారితీస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. సంపద గదులను తెరిస్తే జగన్నాథుడు ఆగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.