మాజీమంత్రిని బలవంతంగా తరలించిన పోలీసులు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతు రుణమాఫీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బేలాలో బుధవారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నాయకులను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. చివరకు మాజీమంత్రిని పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఎదుగుతే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల పాలు చేస్తుందని మాజీమంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించాల్సిన రైతు రుణమాఫీ, రైతు బంధు అందించడంలో విఫలం అయిందని ఆరోపించారు. రైతుల పక్షాన ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నోరు మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.