సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సదస్సులో వక్తలు
ముషీరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశ ప్రజలు, కార్మిక వర్గాలు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని పలు రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
రైతు, కార్మిక, ప్రజల జీవనోపాధిని రక్షించాలని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సదస్సులో కోరారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మెర్చా, సీఐటీయూ, పలు కార్మిక సంఘాల నాయకులు పశ్య పద్మ, విస్సా కిరణ్ కుమార్, వీ ప్రభాకర్, గుమ్మడి నరసయ్య, వేములపల్లి వెంకటరామయ్య, బాలరాజు, జీ వెంకటేశ్, మూడ్ శోభన్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్‌ల వల్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పనిదినం, ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోడ్‌లను రద్దు చేయాలని సంవత్సరాలుగా పోరాడుతున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదస్సులో కార్మిక సంఘాల నాయకులు వామంతరావు, రంగారెడ్డి, యూసఫ్, నాగన్న గౌడ్, మండల వెంకన్న సత్యనారాయణ, గోపాల్, భాస్కర్, మట్టయ్య, పద్మ, శివబాబు, అరుణ, కాంతయ్య, వెంకట్ రాములు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.