calender_icon.png 4 February, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం...

03-02-2025 10:24:31 PM

కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌కు అనుకూలంగా... పేదలకు, రైతులకు వ్యతిరేకంగా ఉంది..

సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నిరసన..

ముషీరాబాద్ (విజయక్రాంతి): కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు, ఆదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు (సీసీఏం) నాగయ్య తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ కమిటీ కార్యదర్శి ఏం.వెంకటేష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగయ్య పాల్గని మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. రైతులకు, కార్మికులతో పాటు పేద ప్రజానికానికి ఈ బడ్జెట్‌ వ్యతిరేకంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్విర్యిం చేసి, ప్రయివేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు తీసుకురావాలని బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు.

ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 47వేల కోట్ల వాటాలను ఉపసంహరించుకున్నారని, బీమా రంగాన్ని 100 శాతం ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రైతులకు, ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో సైతం కోత పెట్టారని, బీమా రంగాన్ని ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేస్తోందన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్రాన్ని గద్దెదించాలన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్ధులన్నారు. ఇక్కడినుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు తక్షణమే నిధులు తెస్తారా లేక రాజీనామ చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. కార్మిక, రైతులను విస్మరించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని, వాటిని వెంటనే తొలగించాలన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను, ఖనిజ సంపదను కేంద్రానికి అప్పజేప్పాలని ఇక్కడున్న బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ కేవలం 40శాతం మందికి అనుకూలంగా ఉందన్నారు. 

అనంతరం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ. జ్యోతి మాట్లాడారు. 2025-26కు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బడాకార్పొరేట్‌ సంస్థలను కాపాడే విధంగా ఉందన్నారు. ఈ దేశ సామాన్యులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అ బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌కు పూర్తిగా నిధులను తగ్గించారన్నారు. అంతేకాకుండా మౌలిక అంశాలు విద్యా, వైద్యం, తాగునీరు, రోడ్లుతోపాటు తదితర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన నిధుల కోత విధించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం అనే హామీలను ఇచ్చారని, ఆ విభజన హామీల గురించి ఒక్క హామీ ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. ఆదిలాబాద్‌కు సంబంధించిన సీసీఎస్‌ ఫ్యాక్టరీ ఏమైందన్నారు. బయ్యారం ఉక్కఫ్యాక్టరీ,  రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీల నిర్మాణం, విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రబడ్జెట్‌లో మన వాటా మనం సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.

తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని అనుక్షణం మాట్లాడ్తారు కానీ, తెలంగాణకు కొన్ని నిధులైనా సాధించలేని అక్కడ ఉండి ఏం లాభమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులను రాబట్టాని బీజేపీ ఎంపీలకు సూచించారు. వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో ఉత్పత్తులను పెంచేవిధంగా బడ్జెట్‌ ఉండాలన్నారు. మహిళలకు ఆహార భద్రత కొరవడిందన్నారు. మహిళలకు భద్రత కల్పించే విధంగాను, ఆత్మహత్యలు, వలసలను నిరోదించే పద్దతిలో బడ్జెట్‌ ఉండాలన్నారు. బడ్జెట్‌లో మా నిధులు మేము రాబట్టుకునే విధంగా ప్రజలందరిని సమయుక్తం చేసి  పోరాటాన్ని ఉధృత్తం చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కమిటీ చైర్మెన్‌ డీజీ నర్సింహరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు కల్పించాలని, ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం మొక్కుబడి పోరాటాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. మొక్కుబడి పోరాటాలతో ఏం సాధించలేమన్నారు.

తెలంగాణకు జరిగిన అన్యాయం మీద సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్షంలో అందరినీ కలుపుకుని తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడాలన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌ను నిర్వహించి ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం కండ్లు తెరిపించాలన్నారు. కేవలం మొక్కుబడి పోరాటాలతో కేంద్రం దిగొస్తుందనకుంటే పొరపాటన్నారు. హైదరాబాద్‌ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌ నుంచి మేడ్చేల్‌ వరకు మెట్రోరైలు ప్రాజెక్టు ఇవ్వొచ్చన్నారు. అయితే అలాంటివి ఏం ఇవ్వకుండా తెలంగాణకు గుండుసున్నా చూపించారన్నారు. పాలమూరు, రంగారెడ్డికి మంచి ఇరిగేషన్‌ స్కీం ఉందని, దానికి జాతీయ హౌదా ఇస్తే తెలంగాణ మీద ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు నిధులు తెస్తారా, రాజీనామా చేస్తారా అని నిలదీశారు. ముషీరాబాద్‌ నగర కమిటీ కార్యదర్శి ఆర్‌. వెంకటేష్‌ వందన సమర్పణ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, కేంద్ర, నగర నాయకులు, మహిళలు పెద్దఎత్తున  పాల్గొన్నారు.