calender_icon.png 16 November, 2024 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు తీరని అన్యాయం

25-07-2024 12:00:00 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా తీవ్ర అన్యాయం జరిగింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడి నుండి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. అందులో ఇరువురు కేంద్ర మంత్రులుగానూ వున్నారు. బడ్జెట్ సారాంశం చూస్తే తెలంగాణ పదాన్ని తొలగించిన్నట్లుగా వుంది. గౌర వ ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కోరినా లాభం లేకపోయింది. కేంద్రం వివక్ష చూపిందని తెలంగాణ సమాజానికి బాగా అర్థమైంది. ప్రజలంతా కేంద్ర సర్కారుపై గుస్సాగా వున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను విస్మరించడం, జాతీయ హోదా ఇవ్వక పోవడం పట్ల వివక్ష పరాకాష్ఠకు చేరిం ది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌సహా రాష్ట్రాల విభజన హామీలలో ఒకటైన బయ్యారం ఉక్కు కర్మా గారం అంశం గురించి బడ్జెట్‌లో ఊసు మాత్రమైనా లేదు. ఇవన్నీ ప్రతీసారి ఎన్నికల హామీలుగానే మిగిలి పోతున్నాయి. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించక పోవడం దారు ణం. సైనిక స్కూల్ ప్రస్తావన కూడా అస్సలు లేదు. దీనికి మడికొండలో స్థల సేకరణ కూడా జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు ప్రస్తావన రాలేదు. ఇది స్టేట్ ఫెస్టివల్‌గా వున్నా ‘నేషనల్ ఫెస్టివల్’ హామీని పక్కన పెట్టేశారు. ‘మెగా టెక్స్‌టైల్ పార్క్’ అభివృద్ధికి నిధులు వస్తాయని ఆశలు పెట్టుకుంటే నిరాశే ఎదురైంది. సక్రమంగా పన్నులు కట్టే ఉద్యోగ వర్గాలకు ఈ బడ్జెట్‌లో తీవ్ర అసంతృప్తే ఎదురైంది.

పాత పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపు లేదు. రూ. 48.21 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు 1.26 లక్షల కోట్లు మాత్రమే. కనీసం పది శాతం ఇస్తే బాగుండేది. ఓరుగల్లుకైతే తట్టుకోలేని స్థాయిలో అన్యా యం జరిగింది. అసలు, బీజేపీ పెద్దలు తెలంగాణ ప్రజలు, ఓటర్ల గురించి ఏమనుకుంటున్నారు? ఏం చేసినా పట్టించుకోరనా? ఎటూ పార్లమెంట్ స్థానాలలో గెలిపించారు కనుక, ఇక ఏం పని అనుకుంటున్నారా? ప్రజలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పట్ల పూర్తి అసంతృప్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కి రూ.15,000 కోట్లు కేటాయించి మనకు మొండిచెయ్యి చూపడం సరైంది కాదు. గతంలోనూ తెలంగాణకు నిరాశే ఎదురైంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయించక కేవలం బీహార్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలకు అధిక కేటాయింపులు జరిపి తెలంగాణపట్ల సవతి ప్రేమను చూపించడం బాధాకరం. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయకపోరు.

 కామిడి సతీశ్ రెడ్డి