నేడు జాతీయ గణిత దినోత్సవం
మనందరి జీవితాల్లో గణితం వుంటుంది. కానీ, చాలా అరుదుగా కొందరి జీవితమే గణితాంశాలతో కూడి వుంటుంది. విశ్వ విఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ గణిత కోహినూర్ వజ్రం శ్రీనివాస రామానుజన్. ఆయన చనిపోయి శతాబ్దం దాటినా నేటి కృత్రిమమేధతో కూడిన ఆధునిక శాస్త్ర సాంకేతిక రొబోటిక్ యుగంలోనూ తన ఫార్ములాలు, గణిత సమస్యలనూ నేటి ప్రపంచం అర్థం చేసుకోలేక పోతున్నది. దీన్నిబట్టి ఆయన మేధాశక్తి ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న జన్మించి, 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన రామానుజన్ సృష్టించిన ఓ ఫార్ములాకు నిరూపణ రాబట్టాలంటే ఒక గొప్ప గణిత శాస్త్రవేత్తకే జీవితకాలం పడుతుందని అంటుంటారు. అలాంటివి ఆయన దాదాపు 4000 దాకా అనంతపు శ్రేణులతో కూడిన గణిత అద్భుతాలు అన్వేషించారు.
నాలుగు పుస్తకాలుగా వున్న ఆయన సమస్యలు నేటి ఆధునాతన నవతరపు మేధోజీవులకు సవాళ్లని చెప్పవచ్చు. రామానుజన్ జీవితం కొన్ని శతాబ్దాలకు స్ఫూర్తి పాఠం. యావత్ ప్రపంచం ఆయన అపారమైన మేధాసంపత్తిని గుర్తించి కీర్తించింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో 2011 నుంచి ప్రతి డిసెంబర్ 22న ‘జాతీయ గణిత దినోత్సవం’ జరుపుకుంటున్నాం. రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని 2012ను ‘జాతీయ గణిత సంవత్సరం’గానూ ప్రభుత్వం ప్రకటించింది.
గణితంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ లేకున్నా, ‘ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ’, ‘ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్’గా అనూహ్య రీతిలో ఎదిగిన రామానుజన్ నాటి బ్రిటిష్ పరిపాలనలో వున్న దేశం నుంచి ఎదిగి వచ్చిన ఓ అసామాన్య భారతీయుడు. నేడు సాంప్రదాయక, క్వాంటం భౌతికశాస్త్రంలోని స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్స్, విశ్వావిర్భావం వంటి శాస్త్రీయ అంశాల్లో రామానుజన్ గణిత పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం.
నేటి తరంలో కొందరు విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గణితం అంటే ఒకింత భయం ఉంటుంది. కానీ, మానవ నాగరిక జీవనంలో అన్ని రంగాల్లో గణితంతో మనిషి ఉనికి, బతుకుతెరువు ముడిపడి వుంటుంది. నేటి శాస్త్ర సాంకేతికత అంతా గణిత పునాదులపైనే నిర్మితమవుతుంది. కాబట్టి, నేటితరం పిల్లలకు గణితంపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఆధునికతతో కూడిన స్ఫూర్తినిచ్చే బోధనా మాధ్యమాలను వినియోగించాలి. రామానుజన్, ఆర్యభట్ట, భాస్కరుడు, శకుంతలా దేవి వంటి గణితశాస్త్ర ఉద్ధండుల గురించి పిల్లలకు చెప్పాలి. ఈమధ్య విడుదలై, ఆకట్టుకున్న ‘35 చిన్న కథ కాదు’ వంటి సినిమాలను పిల్లలకు చూపించాలి. రామానుజన్ వంటి జీనియస్ మన తరగతి గదుల్లో ఎందుకు తయారు కావటం లేదనే డా. అబ్దుల్ కలాం ఆలోచనకు మనమంతా కారణాలను అన్వేషించాలి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్