ప్రత్యేక బస్సుకి అదనపు ఛార్జ్
సిద్దిపేట (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా వేడుకలు ముగిసిన వేళ టిజిఆర్టిసి ప్రయాణికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటుంది. పట్నానికి తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికులకు ఆర్టీసీ స్పెషల్ బాదుడు మొదలుపెట్టింది. సిద్దిపేట నుండి జూబ్లీహిల్స్ వరకి ఎక్స్ ప్రెస్ కి సాధారణంగా రూ. 140 చార్జింగ్ ఉండగా అదే బస్సులకు స్పెషల్ బస్సు బోర్డు ఏర్పాటు చేసి రూ .200 ఛార్జింగ్, డీలక్స్ రెగ్యులర్ చార్జి రూ. 170 ఉండగా స్పెషల్ డీలక్స్ కు రూ .230 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని ప్రభుత్వం ఆదేశాలని అమలు చేస్తున్నామంటూ మాట దాట వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో చార్జీలు పెంచడం పట్ల ప్రయాణికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులనే స్పెషల్ గా ఏర్పాటు చేస్తూ ప్రజలను దోపిడీ గురిచేస్తుందని వాపోతున్నారు. బస్టాండ్ లోకి వచ్చిన ప్రతి బస్సుని గమనించి ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.