calender_icon.png 24 December, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు బోగీలు ఇప్పట్లో లేనట్లే!

07-11-2024 12:14:09 AM

  1. మెట్రోలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులు
  2. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలు పెట్టలేని పరిస్థితి
  3. మూడు బోగీలతోనే కాలం గడుపుతున్న యాజమాన్యం
  4. ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుండటంతో మెట్రోకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఆటోలు, బస్సులతో పోల్చితే తక్కువ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుండటంతో చాలామంది మెట్రోకు మొగ్గు చూపుతున్నారు.

అయితే, రద్దీ పెరిగినా సరిపడా బోగీలు లేకపోవడంతో కొన్నిసార్లు ఒక్కో బోగీలో సామర్థ్యా నికి మించి ప్రయాణికులు ఉంటున్నారు. మరీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అదనపు బోగీలు పెంచుతామని కొన్ని నెలల క్రితం హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. నగరంలో మెట్రో సర్వీసులు ప్రారంభమై ఈ నెలతో ఏడేండ్లు కావొస్తున్నా ఎల్‌అండ్‌టీ మెట్రో యాజమాన్యం, హైదరాబాద్ మెట్రో యాజమాన్యం బోగీల సంఖ్య పెంచకుండా కాలం వెళ్లదీస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదనపు బోగీలు తెస్తామని గతంలో ప్రకటించిన మెట్రో యాజమాన్యం రెండేండ్లుగా కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో వేర్వేరుగా పాల్గొన్న ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి, హైద రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు అదనపు రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

వారి వ్యాఖ్యలను బట్టి మెట్రో బోగీలు ఇప్పట్లో లేనట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో మెట్రో ఫేజ్ -2 పనులు చేపట్టబోతున్నప్పటికీ మొద టి దశలోని మెట్రో రైళ్లకు బోగీలు పెంచకపోవడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆదరణ పెరుగుతున్నా.. 

రోజురోజుకూ హైదరాబాద్ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు నడిపిస్తున్నారు. 57 మెట్రో రైళ్లకు 171 బోగీలు ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 1028 ట్రిప్పులు నడుస్తున్నాయి. మెట్రో సర్వీసుల ఆరంభంలో ప్రతిరోజు రెండు లక్షల మంది ప్రయాణించారు.

ప్రస్తుతం ప్రతిరోజు 4.80 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్లూలైన్ (నాగోల్  రాయదుర్గ్), రెడ్‌లైన్(ఎల్బీనగర్ గ్రీన్‌లైన్ (పరేడ్ గ్రౌండ్  ఎంజీబీఎస్) రూట్లకు తోడు ప్రభుత్వం మరో ఆరు కారిడార్లను నిర్మించేందుకు రూ.24,269 కోట్లతో పరిపాలనా అనుమతులను జారీ చేసింది.

అయినప్పటికీ, మొదటి దశలోని రూట్లలో రద్దీకి అనుగుణంగా బోగీలను తీసుకురాకపోవడం గమనార్హం. కాగా, హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రస్తుతం ఆరు బోగీలు ఆగేందుకు అనుగుణంగా ఉన్నాయి.

త్వరలో నాగ్‌పూర్ నుంచి 4 కొత్త రైళ్లు 

ఉదయం, సాయంత్రం వేళల్లో (పీక్ అవర్స్)  మెట్రోల్లో కాలు మోపాలంటేనే కష్టంగా ఉంటుంది. మూడు బోగీల్లో దాదాపు మూడు వందల మంది ప్రయాణించే వెసులుబాటు ఉండగా పీక్ అవర్స్‌లో ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. దీంతో మహిళలకు కేటాయించిన సగం బోగీలోకి కూడా పురుషులు చొచ్చుకెళ్తున్న పరిస్థితి ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

నాగ్‌పూర్ నుంచి మెట్రో బోగీలను తీసుకొస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో, మెట్రో హైదరాబాద్ యాజమాన్యం రెండేండ్లుగా చెబుతున్నప్పటికీ చేతలు మాత్రం శూన్యమేనని విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 171కి  తోడు మరో 40 నుంచి 50 బోగీల అవసరం ఉందని, అదనపు బోగీల కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉన్నందునే కాలయాపన జరుగుతోందని తెలుస్తోంది.

కాగా, నాగ్‌పూర్ నుంచి కనీసం నాలుగు మెట్రో రైళ్లను అద్దె ప్రాతిపదికన తీసుకొస్తామని, తద్వారా రద్దీని నివారించేందుకు అదనపు సర్వీసులతో  చర్యలు తీసుకోబోతున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం వ్యాఖ్యలు చేశారు. దీంతో అదనపు బోగీల రాకకు మరికొంత సమయం పడుతుందని చర్చించుకుంటున్నారు.