calender_icon.png 30 September, 2024 | 10:04 AM

సినిమా లెవల్‌లో దోపిడీ

28-09-2024 01:45:56 AM

కేరళలో ఏటీఎంల ధ్వంసం 

నమక్కల్, సెప్టెంబర్ 27: తమిళనాడు సరిహద్దుల్లో శుక్రవారం సినిమాను తలపించే సీన్స్ కనిపించాయి. దొంగల ముఠా పరుగులు, పోలీసుల చేజింగ్.. రయ్ రయ్‌మంటూ కార్ల పరుగులు.. సైరన్ల మోతలు.. చివరకు ధన్..ధన్‌మని తుపాకీ కాల్పులు.. ఏం జరిగిందంటే.. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మూడు ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కట్‌చేసిన కొందరు దొంగలు దాదాపు రూ.70 లక్షలు దోచుకొని ఒక కంటైనర్ ట్రక్‌లో పారిపోతున్నారు.

విషయం తెలిసిన కేరళ పోలీసులు ఆ రాష్ట్రంలోని పాలక్కడ్‌తోపాటు తమిళనాడులోని కోయంబత్తూరు, క్రిష్ణగిరి, సేలం పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. దీంతో తమిళనాడులోని నమక్కల్ జిల్లా కుమరపలయం వద్ద వాహనాలు చెక్‌చేస్తుండగా ఓ ట్రక్ ఆపకుండా దూసుకెళ్లింది.

ముందు ఉన్న బైక్‌లు, కార్లను గుద్దుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఇక అక్కడి నుంచి చేజింగ్ మొదలైంది. దాదాపు 8 కిలోమీటర్ల దూరం చేజ్ చేసిన తర్వాత దొంగలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించాడని, మరొకడు గాయపడ్డాడని సేలం రేంజ్ డీఐజీ ఈఎస్ ఉమ తెలిపారు.