calender_icon.png 17 October, 2024 | 5:59 AM

అప్పనంగా దోపిడీ!

17-10-2024 03:32:21 AM

టెండర్ లేదు.. సిబ్బందీ లేరు నెలనెలా రూ.15 లక్షలు స్వాహా

  1. ‘మున్సిపల్’ అధికారుల లీలలు 
  2. స్వచ్ఛభారత్ మిషన్ నిధులు ‘అస్కీ’కి దోచిపెడుతున్న సీడీఎంఏ
  3. మూడున్నర ఏండ్లుగా ఇదే తంతు 
  4. సీఎం రేవంత్‌రెడ్డి కంటపడకుండా జాగ్రత్తపడుతున్న ఉన్నతాధికారి?

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల వ్యవహారం. ప్రభుత్వానికి నష్టం జరిగితే మాకేంటి.. మా జేబులు నిండితే చాలన్నట్టు ఉంది వారి తీరు. అందుకే ప్రతినెలా రూ.15 లక్షల ప్రజాధనాన్ని ఓ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి దోచిపెడుతున్నారు.

ఎలాంటి టెండర్ లేదు.. సిబ్బంది ఉండరు.. అటెండెన్స్ అసలే లేదు.. కానీ, మూడున్నరేండ్లుగా సీడీఎంఏలో నెలనెలా రూ.15 లక్షల దోపిడీ వ్యవహారం నిరాటంకంగా సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఈ అనధికారిక దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పురపాలక శాఖలో..

ఆ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీతో కుమ్మక్కయిన కొందరు అధికారులు స్వచ్ఛభారత్ మిషన్ నిధులను గతంలోలాగే దారిమళ్లిస్తున్నారు. ఈ దోపిడీ వ్యవహారం పురపాలక శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మౌనంగా ఉండటంతో పాటు ఈ అనధికారిక దోపిడీ గుట్టు సీఎం రేవంత్‌రెడ్డి కంట పడకుండా సదరు ఉన్నతాధికారి జాగ్రత్త పడుతున్నట్టు సీడీఎం ఏలో జోరుగా చర్చ జరుగుతోంది. 

సంస్థలను కాదని.. 

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్  (పీఎంఈ) ఏర్పాటుకు అనుమతి ఇస్తూ నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, కచ్చితంగా టెండర్ పిలిచి మాత్రమే పీఎంఈని ఏర్పాటు చేసుకో వాలి.

అయితే, ఎలాంటి టెండర్ లేకుండానే అస్కీ (అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)కి గత ప్రభుత్వం నామినేషన్‌పై అప్పగించింది. దీంతో సీడీఎంఏ ఆఫీసులో అనధికారికంగా స్వచ్ఛ భారత్ మిషన్‌కి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీగా అస్కీ చెలామణి అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ), ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈఎన్‌వై) వంటి సంస్థలు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌ను నిర్వహించేవాళ్లు.

గతంలో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ జనరల్‌గా ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్భన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) సంస్థ కూడా పీఎంఈ నిర్వ హణ బాధ్యతలు చూసేది. ఇందులో దాదాపు 30 మంది ఉద్యోగులు ఉండేవాళ్లు. కానీ, అస్కీ కోసం పురపాలక శాఖ అధికారులు ఎన్‌ఐయూఎంను పూర్తిగా నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

వాళ్ల చేతికే తాళాలు 

ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎఫ్‌ఎస్‌టీపీ) నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాద నలు (డీపీఆర్) అస్కీనే రూపొందిస్తుంది. నిర్మాణాల నాణ్యతపై క్వాలిటీ చెక్ ప్రక్రియను కూడా అస్కీకే అప్పగించడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. థర్డ్ పార్టీ చెకింగ్ లేకుండానే అస్కీ.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎఫ్‌ఎస్‌టీపీల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డదని పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరు సీడీఎంఏ అధికారులు అనుమా నం వ్యక్తంచేస్తున్నారు.

ఇందుకు ప్రధాన కార ణం ఇతర రాష్ట్రాల్లో ఒక ఎఫ్‌ఎస్‌టీపీ నిర్మా ణ వ్యయంతో పోల్చితే రాష్ట్రంలో అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. బయోమైనింగ్, ఎస్‌ఎఫ్‌టీపీల బిల్లు లు అస్కీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మం జూరు చేస్తుండటంతో సీడీఎంఏలో అస్కీ కర్ర పెత్త నం పెరిగిందనడానికి నిదర్శనమని చెప్తున్నా రు.

ప్రభుత్వం విచారణ చేస్తే ఎఫ్‌ఎస్‌టీపీల నిర్మాణాల్లో జరిగిన అవినీతి వెలు గులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే అంటున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌ను అస్కీ నిర్వహించింది. జీహెచ్‌ఎంసీలోను వీరి ఆగడాలు శృతి మించడంతో గతంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి అస్కీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి పుల్‌స్టాప్ పెట్టారు.

సీడీఎంఏలో ఉండే ఓ బృందం మున్సిపాలిటీల్లో ఉండే సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో పని చేస్తు న్న సిబ్బందిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఈ విష యం సీడీఎంఏ, ఎంఏ యూడీ ఉన్నతాధికారులకు తెలిసినా స్పం దించట్లేదని ఆరోప ణలు ఉన్నాయి.

అంతా ఆ ప్రొఫెసర్ కనుసన్నల్లోనే?

అడ్మినిస్టేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండి యా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ విభాగంలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. సదరు ప్రొఫెసరే ఈ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని, ఐఏఎస్‌లతో ఉన్న పరిచయాలతో ఇప్పటికే చాలా ప్రాజెక్టులను తీసుకోవడంతో పాటు సీడీఎంఏలో చక్రం తిప్పుతున్న ట్టు సమాచారం.

ఈ క్రమంలోనే అనేక ఆర్థ్థిక అవకతవకలు జరుగుతున్నా అడిగే నాథుడు లేడని అంటున్నారు. ఆ ప్రొఫెసర్ చేసిన పనుల పాలసీ మీదా ఎలాంటి చెకింగ్ లేకుండా అప్రూవ్ అవుతుంటాయట. పేపర్లపై కొత్త ప్రతిపాదనలు చూపి మాటలతో గారడి చేస్తున్నాడని సీడీఎంఏ ఉద్యోగులు చెప్తున్నారు. అలాగే తన ఆఫీసులో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడని, తన వద్ద పని చేయలేక వెళ్లిపోయిన వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తాడనే ఆరోపణలూ ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆ ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారట. స్వయంగా ఏడీఎంఏ చెప్పినా ఆ ప్రొఫెసర్ వినడం లేదనే సమాచారం. ఆయన చేపట్టే ప్రాజెక్టుల్లో కీలక స్థానాల్లో సీమాంద్ర వాళ్లను నియమించి, తెలంగాణకు సంబంధించిన సిబ్బందికి అర్హతలున్నా కిందిస్థాయిలో నియమిస్తాడని మున్సిపాలిటీలో పని చేస్తున్న సిబ్బంది ఆరోపిస్తు న్నారు.

అయితే, పీఎంఈ నిర్వహణ గడువు త్వరలోనే ముగియనుండటంతో మళ్లీ అస్కీ కే ఇచ్చేందుకు సీడీఎంఏలో కొందరు అధికారులు స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. సాక్షా త్తు ముఖ్యమంత్రి పర్యవేక్షణలోని పురపాలక శాఖలో జరుగుతున్న అనధికారిక ఔట్ సోర్సింగ్ దోపిడీపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సిబ్బంది లేకున్నా ఆగని జమ

స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఏజెన్సీగా తిష్టవేసిన అడ్మినిస్ట్రేటీవ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ)కి సీడీఎంఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రతినెలా రూ.15 లక్షలు దోచిపెడుతున్నారు. సుమారు 15 మంది అస్కీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నట్టు చూపిస్తున్నారు.

టీంలీడర్, కో ఆర్డినేటర్, సభ్యులతోపాటు వాటర్ అండ్ వేస్ట్ వాటర్, వేస్ట్ వాటర్, ఐటీ, కెపాసిటీ బిల్డింగ్ వంటి 15 రకాల అంశాల పర్యవేక్షణ కోసం సుమారు 15 మంది ఉండాల్సిఉండగా, నలుగురు మాత్రమే ఉన్నారు. వాళ్లకూ అటెండెన్స్ తీసుకోవడం లేదు.

కానీ, గత మూడున్నరేండ్లుగా ప్రతినెలా క్రమం తప్పకుండా అస్కీ ఖాతాలో రూ.15 లక్షలు (ఏడాదికి రూ.1.80 కోట్లు) మాత్రం టంచనుగా జమ అవుతున్నాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలతోపాటు ఆఫీసు నిర్వహణ, స్టేషనరీ పేరిట తప్పుడు బిల్లులతో రూ.15 లక్షలను దర్జాగా కాజేస్తున్నారని సీడీఎంఏలోని సిబ్బంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు.