calender_icon.png 24 October, 2024 | 11:47 AM

ఆరోగ్య పరీక్షల పేరుతో దోపిడీ

09-07-2024 04:08:33 AM

  • టెండర్ లేకుండానే ప్రైవేట్ కంపెనీలకు కార్మికుల సొమ్ము 
  • సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షల పేరుతో సీఎస్‌సీ హెల్త్ కేర్ సంస్థ భారీ దోపిడీకి పాల్పడుతోందని, తక్షణమే ఈ సంస్థ చేపడుతున్న ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి భవన నిర్మాణ రంగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు ఎం మహేందర్, ఎం శ్రీనివాస రావుతో కలిసి వివరాలను వెల్లడించారు. 

భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్టుగా సీఎస్‌సీ హెల్త్ కేర్ సంస్థ దొంగ లెక్కలు చూపిస్తూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డు సొమ్మును పెద్ద మొత్తంలో దోచుకుంటుందని ఆరోపించారు. 2022లోనే ఏర్పడిన ఈ సంస్థకు అదే సంవత్సరం ఎలాంటి టెండర్ లేకుండా ఎలా కాంట్రాక్ట్ కేటాయిస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు అవసరం ఉన్నా.. లేకున్నా.. హెల్త్ క్యాంపులు నిర్వహించకపోయినా నిర్వహించినట్టుగా అనేక దొంగలు లెక్కలు సృష్టించి బోర్డు నిధులను భారీ ఎత్తున కాంట్రాక్ట్ సంస్థకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉండగా, ఇప్పటి వరకు 11 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ పేరుతో ఒక్కో కార్మికుడికి రూ. 3,256 చొప్పున గతేడాది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి రూ.124 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు చేశారు. 

డిమాండ్లు..

  1. సీఎస్‌సీ హెల్త్ కేర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి. 
  2. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం రేట్ల ప్రకారమే ఈ కాంట్రాక్ట్‌కు చెల్లిస్తున్నందున, రాష్ట్రంలోనే సీజీహె చ్‌ఎస్ ద్వారా టెస్టులు చేస్తున్న విజయ డయాగ్నస్టిక్స్, అపోలో వం టి ప్రముఖ వైద్య సంస్థలకు కార్మికుల ఆరోగ్య పరీక్షల నిర్వహణ అప్పగించాలి. 
  3. ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలి. 
  4. బాధ్యులైన అధికారులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి