23-03-2025 06:26:59 PM
అమరావతి,(విజయక్రాంతి): గత వైఎస్సార్‌సీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషింగ్ వ్యాపార యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినందుకు వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతరులపై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ(Anti-Corruption Department) కేసు నమోదు చేసిందని పోలీసులు ఆదివారం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో ఈ దోపిడీ జరిగింది. స్టోన్ క్రషర్ లో జాషువా అనధికార తనిఖీలు జరిపిన నెల రోజుల తరువాత యాజమాన్యానికి ఫోన్ చేశారు. వెంటనే విడుదల రజనిని కలవాలని, లేకపోతే రూ.50 కోట్లు జరిమాన విధించడంతో పాటు క్రషర్ ను సీజ్ చేస్తామని బెదిరించాడు. దీంతో వారు రజినిని కలవడంతో ఆమె సహాయకుడు దొడ్డ రామకృష్ణ రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడు.
కొన్నాళ్ల తర్వాత జాషువా స్టోన్ క్రషర్ యజమానులను తన ఆఫీస్ కు పిలిపించుకొని తర్వగా సెటిల్ మెంటె చేసుకోవాలని హెచ్చరించారు. దీంతో క్రషర్ యజమానుల రజిని మరిది విడుదల గోపిని పురుషోత్తపట్నంలో 2021 ఏప్రిల్ 4న రాత్రి ఆయన నివాసంలో కలిసి రూ. 2.20 కోట్లు చెల్లించారు. అదే రోజు గుంటూరులో జాషువాకు రూ.10 లక్షలు, గోపిని కలిసి మరో రూ.10 లక్షలు చెల్లించారు. విడుదల రజిని ఆదేశాల మేరకే స్టోన్ క్రషర్ పై తనిఖీలు చేసినట్లు జషువా చెప్పారని, డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు నమోదు చేసి వ్యాపారం మూయించేస్తామని యజమన్యంపై బెదిరింపులకు పాల్పడినట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7A భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 384, 120Bల కింద లంచం, నేరపూరిత కుట్ర, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాల కింద A1 గా రజిని, A2 గా జాషువా, A3 గా రజిని మరిది విడుదల గోపి, A4 గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణ ఎసీబీ కేసు నమోదు చేసిందని పోలీసులు వెల్లడించారు.