11-04-2025 11:41:44 PM
అమెరికా, చైనా పరస్పర సుంకాలపై విదేశాంగ మంత్రి జైశంకర్..
ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం..
న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య సుంకాల విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని తీవ్ర గందరగోళం, ఆర్థిక సంక్షోభం వైపు నడిపించే అవకాశముందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ హెచ్చరించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమావేశంలో జై శంకర్ మాట్లాడారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఇలా పరస్పర సుంకాలు విధించుకోవడాన్ని జైశంకర్ ‘టిట్ ఫర్ టాట్’గా అభివర్ణించారు. ఈ రెండు దేశాల మధ్య నలగకుండా భారత్ తన ప్రయోజనాలు కాపాడుకునే పనిలో ఉందని పేర్కొన్నారు.
‘అమెరికా సంబంధాలకు సంబంధించి మా అనుభవాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనా మధ్య వ్యాపారం పరంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోనే ఉంది. ఇది గోల్డిలాక్స్ సమస్య లాంటిది. అంత తొందరగా దీని నుంచి బయటపడలేము. రెండు దేశాలు ఇలా పరస్పరం సుంకాలు పెంచుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. ఇది ట్రేడ్ వార్‌ను సూచిస్తున్నట్టే’ అని జై శంకర్ తెలిపారు.