20-03-2025 12:04:55 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మార్చి 19 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ హాస్టళ్లు, హోటళ్లు, ఆహారం తయారు చేసే కేంద్రాల్లో విరివిగా తనిఖీలు చేసి ఆహార నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆహార నాణ్యత పై ఫుడ్ సేఫ్టీ జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అనుబంధ శాఖల సమన్వయంతో కొన్ని బృందాలను నియమించుకోవాలని, వాటి ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యంగా హోటళ్లు, ఐస్ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలని అన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకి సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించాలని సూచించారు. జిల్లాలో చిరు తిండి అమ్మకాలు సాగిస్తున్న చిన్న వ్యాపారుల వివరాలు సేకరించాలని, ఆహారం తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఆహార సంబంధిత వ్యాపారం చేస్తున్న వ్యాపారం చేస్తున్నవారు నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారం అమ్మకాలు సాగించే చోట పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందజేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.
హోటల్లు, హాస్టల్లో వంటగది, వాష్ ఏరియా శుభ్రంగా ఉంచాలని సూచించారు. వీధి అమ్మకందారులకు పూడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సుజాత, డిడబ్ల్యూఓ సబిత, డిఎస్‌ఓ శ్రీనివాస్, డీఏవో భాగ్యలక్ష్మి, డిఇఓ జనార్ధన్ పాల్గొన్నారు.
విద్యార్థి దశలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి
తిమ్మాపూర్: విద్యార్థి దశలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని పలు రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవం కార్యక్రమం తిమ్మాపూర్ లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థి దశలో స్వేచ్ఛ, అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
ఈ దశలోనే చదువుతోపాటు సమాజ సేవను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు వాలంటీర్లుగా, లీడర్లుగా సేవలు అందించడం కూడా ముఖ్యమేనని తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట రాంబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయి యువజనోత్సవంలో భాగంగా 350 మంది విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్యాల్లో పోటీ నిర్వహించినట్లు తెలిపారు. వాగేశ్వరి విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్.శ్రీనివాస్, ప్రకాశ్ రెడ్డి, సాయినాథ్ పాల్గొన్నారు.