calender_icon.png 21 February, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకవర్గాలకే ‘సహకారం!’

18-02-2025 12:47:43 AM

పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు

ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

డీసీఎంఎస్‌కు ఇంకా సందిగ్ధం 

హర్షం వ్యక్తం చేస్తున్న పాలకవర్గాలు

మెదక్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా?  ప్రస్తుత పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 37 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్కు సంబంధించి అంశం ఉత్తర్వులో లేకపోవడం గమనార్హం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పది రోజుల సమయం ఉండడంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

పొడిగింపుపై హర్షాతిరేకాలు...

ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈనెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో !హర్షం వ్యక్తమవుతుంది. 

గతంలో రెండుసార్లు పొడగింపు...

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇంచార్జిల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్ళ పాటు పొడిగించారు. పర్సన్ ఇంచార్జిలను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించింది.