సీఎం రేవంత్‌రెడ్డి వినతితో కేంద్రం నిర్ణయం
బీఆర్‌ఎస్ హయాంలో నిధులు మింగేశారు
ఇప్పటికైనా పనుల్లో జాప్యం చేయొద్దు
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): స్మార్ట్ సిటీ మిషన్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ర్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న రేవంత్‌రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మేరకు స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది.
రాష్ర్టంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్‌లో ఇప్పటివరకు 45 పనులు పూర్తయ్యాయి. రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయి. రూ.287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నా యని ముఖ్యమంత్రి కేంద్రానికి తెలియజేశారు. స్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్‌ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని తెలిపింది. కానీ కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన కేంద్రం విడుదల చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.
రెండు పట్టణాలకు మహర్దశ
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో మనోహర్‌లాల్‌కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగయ్యాయన్నారు. స్మార్ట్‌సిటీ నిధులను విడుదల చేయాలని గతంలో తాను మూడు సార్లు లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కరోనా వల్ల రెండేళ్ల కాలం వృథా కావడంతో స్మార్ట్‌సిటీ మిషన్‌ను పొడిగించాలని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చిన వినతుల పట్ల కేం దం సానుకూలంగా స్పందించ డంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర నిధులు దారి మళ్లించకుండారాష్ర్ట ప్రభుత్వం తన వాటా కింద మ్యాచింగ్ గ్రాంట్ నిధులను సకాలంలో మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలన్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు. నిధులను సక్రమంగా వినియోగించి పనులను సత్వరమే పూర్తి చేస్తే ఇప్పటికే కరీంనగర్, వరంగల్ అద్దంలా మెరిసేవన్నారు. కానీ, నిధులను దారి మళ్లించారని, తాను పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌లో నిలదీసిన తరువాత కేంద్ర నిధులను జమ చేశారని తెలిపారు. గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం జరిగిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగినట్లే కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు మళ్లీ కమీషన్ల కోసం అవతారమెత్తారని ఆరోపించారు. తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవతవకలు, కమీషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.