03-04-2025 12:00:00 AM
నిజామాబాద్, ఏప్రిల్ 02 (విజయ క్రాంతి): అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు.
జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఏప్రిల్ 30వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ప్లాట్లను, అనధికార లే ఔట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.
వివిధ కారణాల వల్ల రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ రాయితీ సదుపాయం గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించిందని అన్నారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ సూచించారు.
క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని, దీనిని దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారందరు ఈ నెల 30వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని, ప్రభుత్వం పొడిగించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.