calender_icon.png 15 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 వరకు భుజంగరావు మధ్యంతర బెయిలు పొడిగింపు

15-11-2024 02:02:19 AM

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేసిన మధ్యంతర బెయిలు గురువారంతో ముగియనుండటంతో దాన్ని పొడిగించాలన్న భుజంగరావు అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. సాయంత్రం 4 గంటల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో భుజంగరావు అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

దీనికి అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్ కే సుజన మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భుజంగరావు ఆరోగ్యం సరిగాలేదని, తిరిగి జైలుకు పంపితే ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేస్తూ జైలుక వెళ్లకుండా తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని, వివరణ తెలియజేయడానికి గడువు కావాలని కోరారు.

వాదనలను విన్న న్యాయమూర్తి ఈ నెల 18 సాయంత్రం 4.30 దాకా మధ్యంతర బెయిలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

రాధాకిషన్‌రావు బెయిలు పిటిషన్‌పై వాదనలు

ఆధారాలు లేకుండా కేవలం ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తన ను కేసులో ఇరికించారంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడైన పీ రాధాకిషన్ రావు హైకోర్టుకు నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన పీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్ కే సుజన గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. పోలీసుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో పూర్తిస్థాయిలో డాటా తొలగించడం సాధ్యంకాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు కట్టుకథ అల్లి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారన్నారు. విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.