నలుగురు మృతి.. సుమారు 20 మందికి గాయాలు
యూపీ గోండా జిల్లాలో ఘటన
లక్నో, జూలై 18: చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో మధ్యా హ్నం 2:35 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఘటనలో నలుగురు ప్రయాణీకులు మృతిచెందగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఈ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి చండీగఢ్ నుంచి బయల్దేరింది. మర్నాడు మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రైలు మరికొన్ని నిమిషాల్లో ఝులాహి స్టేషన్ చేరుతుందనగా పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీలు పక్కకు ఒరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో అప్పటికే నలుగురు ప్రయాణీకులు తీవ్రగాయాల పాలై మృతిచెందినట్లు గుర్తించారు. క్షతగాత్రులైన మరో 20 మందిని అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ దవాఖానలకు తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీం బిశ్వకర్మ సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిం చారు. ఆ మార్గంలో వెళ్తున్న మొత్తం 13 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను రద్దు చేసింది.