- రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడి రూ.45,500 కోట్లు!
- ప్రపంచ ఆర్థిక వేదికపై కొత్త రికార్డు
- తెలంగాణ ప్రభుత్వంతో దిలీప్ సాంఘ్వీ కంపెనీ భారీ ఒప్పందం
- పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు
- రాష్ర్ట చరిత్రలో ఇదే భారీ పెట్టుబడి
- భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు భరోసా: సీఎం రేవంత్‌రెడ్డి
- రూ.10వేల కోట్లతో కంట్రోల్ ఎస్ సంస్థ ఏఐ క్లస్టర్
- రూ.800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ‘యూఏవీ’ తయారీ యూనిట్
- హెచ్‌సీఎల్ మరో టెక్ సెంటర్ క్యాంపస్
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ దిగ్గజ ఇంధన రంగ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ర్టంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. రాష్ర్టంలో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు.
అనంతరం సీఎం సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పం దంలో భాగంగా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామ ర్థ్యం 3,400 మెగావాట్లు కాగా.. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు లభించనున్నాయి. తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, చర్చలు ఫలించా యని, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఇంత భారీ పెట్టుబడుల ఒప్పం దం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతం గా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనే జింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ పేర్కొన్నారు. ఇది గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు.
భారీగా ఉద్యోగాలు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్ పెట్రో కెమికల్స్‌తో జరిగిన భారీ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతిని ధులను అభినందించారు.
ఈ ఒక్క ఒప్పం దంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గతేడాది దావోస్‌లో సాధించిన రూ.40వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసింద న్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ర్టంలో యువతకు భారీగా ఉద్యోగాలతో పాటు నార్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయన్నారు.
రూ.10వేల కోట్లతో ‘కంట్రోల్ ఎస్’ ఏఐ క్లస్టర్
హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు దిగ్గజ ఆసియా ఏఐ డేటాసెంటర్ ‘కంట్రోల్ ఎస్’ సంస్థ రూ.10వేల కోట్లతో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ‘కంట్రోల్ ఎస్’తో ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సంస్థ 400మెగావాట్ల సామర్థ్యంతో రూ.10వేల కోట్లతో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి పేర్కొన్నారు.
హెచ్‌సీఎల్ కొత్త టెక్ సెంటర్
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో తమ కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తొలుత హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు.
అనంతరం తమ కొత్త క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త క్యాంపస్ ఉండనుంది. సెంటర్ ద్వారా 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
రూ.800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ యూఏవీ తయారీ యూనిట్
రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన యూఏవీ లిమిటెడ్‌తో రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం జేఎస్‌డబ్ల్యూ సంస్థ రూ.800కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు రక్షణ రంగంతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ కేంద్రంగా మారే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.