calender_icon.png 3 April, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు

02-04-2025 01:29:41 AM

  1. 21 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
  2. బాయిలర్ పేలడంతోనే ప్రమాదం..
  3. మృతుల కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారం

గాంధీనగర్, ఏప్రిల్ 1: గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం దీసా పట్టణానికి సమీ పంలో ఉన్న పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకోగా.. ఆరుగురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాయిలర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బనస్కాంత ఎస్పీ అక్షయరాజ్ మక్వానా తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు ఉదయం 9.45 గంటల ప్రాంతంలో జరిగినట్టు స్థానికులు తెలిపారు.

ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆర్‌సీసీ స్లాబ్ కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు, వారి కుటుంబసభ్యులు పైకప్పు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉండగా.. ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున నష్ట పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ‘పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు బాధాకరం. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని తెలిపారు.