రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిని వేధిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఒక వర్గంపై పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ తమ హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ చింతపండు మహేశ్, కారాగిరి రాజేందర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేరళ స్టోరీ, కశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాల ప్రదర్శనలకూ అనుమతించడంలేదన్నారు. సంబంధంలేని నేరాలతో ఒకవర్గంపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 10 రోజులకు మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన సందర్భాలున్నాయన్నారు. ఒక వర్గంవారిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.