calender_icon.png 7 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ పీజీ స్థానికత కోటాపై వివరణ ఇవ్వండి

07-11-2024 01:41:29 AM

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికత కోటా వివాదంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 12న జరుపుతామని, ఆలోగా నివేదిక అందజేయాలని ప్రతివాదులైన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్లకు నోటీసు లు ఇచ్చింది.

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాల నిబంధనలు 2021లోని రూల్‌ను సవాల్ చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎస్ సత్యనారా యణ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వీ రజిత వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 148 ప్రకారం బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్ సీటుకు స్థానిక కోటా కింద పరిగణిస్తారన్నారు. తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

రాష్ట్రం వెలుపలి విద్యాసంస్థల్లో (సిద్దార్థ మెడికల్ కాలేజీ) చదివిన వారిని స్థానికులుగా పేర్కొనడం దారుణమన్నారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం విచారించింది. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను కొట్టివేసి, పిటిషనర్లకు స్థానిక కోటా కింద సీట్లు కేటాయించేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎం సురేందర్‌రావు కోరారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.