calender_icon.png 26 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వండి

26-10-2024 12:08:03 AM

రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైడ్రాకు విస్తృతాధికారాలు ఎందుకు కల్పించారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల తర్వాత జరిగే విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొన్నది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ 4ను జారీ చేసింది. దానిని గవర్నర్ ఈ నెల 3వ తేదీన ఆమోదించారు. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు) హైకోర్టును ఆశ్రయించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం1955ను సవరించి గెజిట్లో ప్రచురిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆర్డినెన్స్ చట్ట వ్యతిరేకమని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్‌ఆర్‌వో, వాల్టాలోని అధికారాలు హైడ్రాకు బదలాయించారని.. ఇదంతా చట్టవిరుద్ధమని వాదించారు.