calender_icon.png 21 September, 2024 | 4:12 PM

ఆధునిక పోలీసింగ్‌కు నైపుణ్యమే కీలకం

21-09-2024 12:15:00 AM

  1. టెక్నాలజీతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
  2. అంతర్గత భద్రతలో సాంకేతికత చాలా కీలకం
  3. అందుకే పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు
  4. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆధునిక పోలీసింగ్‌కు నైపుణ్యతే కీలకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశంలో శాంతిని నెలకొలిపే బాధ్యత యువ అధికారుల భుజాలపై ఉంద ని వ్యాఖ్యానించారు. దేశంలో లెఫ్ట్ తీవ్రవాదం తగ్గిందని, సైబర్ నేరాలు కొత్త సవాళ్లుగా మారాయన్నారు.

సాంకేతిక నైపుణ్యాల సాయంతోనే సైబర్ సవాళ్లను ఎదుర్కోవచ్చని, అందుకే టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. శుక్రవా రం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) 76వ బ్యాచ్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. కార్యక్రమానికి నిత్యానందరాయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిని సత్కరించి మాట్లాడారు. దేశం స్వాతంత్య్ర అమృ తోత్సవాలను జరుపుకుంటున్న వేళ దేశసేవలోకి ప్రవేశిస్తున్నారని, విధుల్లో కొత్త సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 

నూతన చట్టాలను అర్థం చేసుకోవాలి

సైబర్ నేరాల నియంత్రణకు హోంమంత్రిత్వ శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. ఆ ల్యాబ్‌లను ఉపయోగించుకోవడం, కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. నూతన చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ట్రైనీలు అర్థం చేసుకొని ముందు కు సాగాలన్నారు. రాబోయే రోజుల్లో  అంతర్గత భద్రతను నిర్వహించడంలో సాంకేతికత క్రియా శీలక పాత్ర పోషించబోతోందని, అందుకే కేంద్రప్రభుత్వం పోలీస్ టెక్నాలజీ మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

13 మంది 25 ఏళ్ల లోపే..

207 మంది ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లలో 13 మంది 25 ఏళ్ల లోపు ఉన్నారు. 102 మంది 25 ఏళ్ల మధ్య, 73 మంది 28 ఏళ్లకు పైన ఉన్నారని అధికారులు చెప్పారు. ట్రైనీల్లో 109 మంది ఇంజినీరింగ్ చదవగా.. 28 మంది ఆర్ట్స్, 22 మంది సైన్స్, 15 మంది ఎంబీబీఎస్, 8 మంది, నలుగురు న్యాయశాస్త్రం, ఇతరులు ఇద్దరు ఉన్నారు. పరేడ్‌కు కేరళ క్యాడర్‌కు చెందిన అచ్యుత్ అశోక్ కమాండర్‌గా వ్యవహరించారు. 76వ బ్యాచ్‌లో ఈయన ఓవరాల్ టాపర్‌గా నిలిచారు.  అత్యత్తమ ప్రదర్శనకు గాను నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ ట్రోఫీని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదుగా అందుకున్నారు. పదేళ్లలో తెలంగాణ కేడర్ అధికారికి పరేడ్ కమాండర్‌గా వ్యవహరించే అవకాశం ఒక్కసారి మాత్రమే వచ్చింది. 2017లో గౌస్ ఆలం పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ ఎస్పీగా విధులు           నిర్వహిస్తున్నారు.

207 ట్రైనీ ఆఫీసర్లతో అమిత్ గార్గ్ ప్రమాణం

219 మందితో 76వ బ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో 12మందికి ఐఏఎస్ రావడంతో 207 మందితో ట్రైనింగ్ కొనసాగింది. వీరితో ఎన్‌పీఏ డైరెక్టర్ అమిత్ గార్గ్ ఐపీఎస్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును ఆఫీసర్ ట్రైనీలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారు దేశానికి బాగా సేవ చేయాలని గార్గ్ ఆకాంక్షించారు. ఈ బ్యాచ్‌లో 58 మంది మహిళలు ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్‌లలో 188 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులు కాగా.. 19 మంది విదేశీ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. నేపాల్, మాల్దీవుల అధికారులు ఐదుగురు చొప్పున, భూటాన్‌కు చెందిన ఆరుగురు, మారిషస్‌కు చెందిన ముగ్గురు అధికారులు ఎన్‌పీఏలో ట్రైనింగ్ పొందారు. ప్రతీ బ్యాచ్‌లో విదేశీ అధికారులకు కూడా ఎన్‌పీఏ ట్రైనింగ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.