ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మే16 (విజయక్రాంతి) : బోధన అనుభవం ఉన్న వారినే ఓయూ వీసీగా నియమించాలని, అక్రమాలకు పాల్పడ్డ ప్రొఫెసర్లకు ఇవ్వద్దని ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్లను నియమించడంలో జాప్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీసీల పదవీ కాలం ముగియక ముందే నోటిఫికేషన్ ఇచ్చి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసిందని, దీన్ని ఏఐఎస్‌ఎఫ్ స్వాగతిస్తున్నదని చెప్పారు.
విద్యార్థులకు చదువు చెప్పకున్నా పలువురు అక్రమాలకు పాల్పడి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారని, వారిలో చాలా మంది వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. యూజీసీ నిబంధనల ప్రకారం, సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే 10 రీసెర్చ్ ఆర్టికల్స్‌ను పబ్లిష్ చేసి ఉండాలని, వారికి కనీసం ఇద్దరు పీహెచ్‌డీ అవార్డు పొందిన విద్యార్థులుండాలని గుర్తు చేశారు. ఇలాంటి అర్హతలేవీ లేకున్నా పలువురు అక్రమాలకు పాల్పడి ఓయూ, కేయూ, అంబేడ్కర్, జేఎన్టీయూ, ప్రొఫెసర్లుగా ప్రమోషన్ పొందారని, వారికి వీసీల నియామకంలో అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి భగత్, నాయకులు శేఖర్, అశ్విన్, తదితరులు పాల్గొన్నారు.