* కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్రకుమార్
* రాష్ట్రంలో 161పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై ఆరా
* అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): అటవీ శాఖ అనుమతుల విషయం లో చిన్న చిన్న సమస్యలను నేరుగా కలిసి చర్చిస్తే సత్వరం పరిష్కారమవుతాయని కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రజలకు సత్వరమే ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో అనుమతులు వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు.
తెలంగాణ అటవీ అధికారుల పనితీరును ప్రశంసించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చొరవ చూపడం అభినందనీయమన్నారు. తెలంగాణలో ఉన్న అటవీ అనుమతుల పెండింగ్ విషయంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్, రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియల్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జరిగింది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి తెలంగాణ అటవీ శాఖలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్‌ను హైదరాబాద్ వెళ్లి సమీక్షించాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో ఉన్నతస్థాయి సమా వేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి..? ఎందుకున్నాయి? అనే విషయాలపై అటవీ, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదా రుల విభాగం అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టుల వివరాలను పీసీసీఎఫ్ డోబ్రియల్ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు.
మొత్తం 161 ప్రాజెక్టులు అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో జాతీయ రహదారులకు సంబంధించి 12 ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యం కలిగినవని పేర్కొన్నారు. అంతకు ముందు దక్షిణ రాష్ట్రాల అటవీ అధికారులతో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరుతో చెట్టు నాటడం), నగర్ వన్ యోజన పథకాలపై చర్చించారు. ఈ పథకాల్లో ఆయా రాష్ట్రాల లక్ష్యాలు, సాధించిన ప్రగతిని డైరెక్టర్ జనరల్ తెలుసు కున్నారు.
సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ అంజన్ కుమార్ మహంతీ, కేరళ పీసీసీఎఫ్ గంగా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ త్రినాథ్ కుమార్, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఈలు సింగ్ మేరు, పీసీసీఎఫ్ (కంపా) డాక్టర్ సువర్ణ, అడిషనల్ పీసీసీఎఫ్ సునీత భగవత్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సీసీఎఫ్ ప్రియాంక వర్గీ స్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.