ప్రస్తుత తరుణంలో ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామర్ పాత్రలు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ సమయంలో గ్లామర్‌తో పని లేదు.. టాలెంట్ ఉంటే చాలని సాయి పల్లవి చెప్పకనే చెబుతున్నారు. గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండానే స్టార్‌డమ్‌ను ఆమె కొనసాగిస్తున్నారు. పాత్రల నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకూ ప్రతి దానిలోనూ ప్రత్యేకతను కొనసాగిస్తారు. నిజంగానే సింగిల్ పీస్ అనిపించుకుంటున్నారు.
అందుకేనేమో ఆమెను వెదుక్కుంటూ బాలీవుడే వచ్చేసింది. ‘రామాయణం’లో సీత పాత్రకు ఏరి కోరి మరీ మేకర్స్ సాయి పల్లవిని ఎంపిక చేశారు. ‘అమరన్’తో మంచి సక్సెస్ సాధించిన సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్.. బాలీవుడ్లో రామాయణం చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరో కొత్త చిత్రాన్ని కూడా లాక్ చేశారట.
‘లక్కీ భాస్కర్’ చిత్రం సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారట. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్లో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వనున్నారట. మొత్తానికి దుల్కర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.