అమెరికా అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్.. ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. ట్రంప్‌తో డిబేట్‌లోనూ కమల సత్తా చాటారు. సర్వేలు కూడా కమలవైపే ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల్లో మాత్రం కమల ఓడిపోయారు. పాపులర్ ఓట్లలోనూ ఆధిక్యం కనిపించలేదు. ట్రంప్‌ది ఏకపక్ష విజయమే అయింది. ట్రంప్‌ను నిరోధించడంలో కమల ఐదు రకాలుగా విఫలమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
* 30 ఏళ్ల తర్వాత బైడెన్ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. కొవిడ్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తం గా దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నా అమెరికా డాలరుకు ఉన్న ప్రత్యేకతలను డెమోక్రాట్లు వినియోగించుకోలేక పో యారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కమల ఆర్థిక విధానాలపై ఓటర్లలో నమ్మకం సన్నగిల్లింది. గ్రాసరీ, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరగడంతో డెమోక్రాట్లపై భారీ ప్రభావం చూపింది.
* ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం ఇమ్మిగ్రేషన్. కమల వైఫల్యంలోనూ ఇది కూడా ప్రధాన అంశం. బైడెన్ పాలనలో భారీ స్థాయిలో అక్రమ వలసలు వచ్చినట్లు అమెరికా డాటా పేర్కొంటుంది. ఇటీవల బైడెన్ ఉత్తర్వులతో చొరబాట్లు తగ్గినప్పటికీ గతేడాది మాత్రం రికార్డు స్థాయిలో దేశం లోని అక్రమ వలసలు వచ్చాయి. దీని రిపబ్లికన్లు అస్త్రంగా వాడుకున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
* డెమోక్రాట్లకు 80 శాతానికిపైగా నల్లజాతి, హిస్పానిక్, ఆసియా ప్రజల మద్ద తు ఉంటుంది. అయితే వీరిలో ఎక్కువమంది శ్రామిక వర్గానికి చెందినవారే. ఈసారి ట్రంప్ హామీలతో ఈ వర్గాలన్నీ ట్రంప్‌వైపు మొగ్గు చూపాయి. అబార్షన్ అంశం కీలక అంశమైనప్పటికీ మహిళలను, యువతను కమల ఆకట్టుకోలేకపో యిందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
* వీటన్నింటితో పాటు కమల ప్రచారంలోకి ఆలస్యంగా అడుగుపెట్టారు. ఎన్నికలకు కేవలం 105 రోజుల ముందే ఆమెను అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నారు. దీంతో ట్రంప్‌తో పోలిస్తే కమల ప్రచారంలో వెనుకబడ్డారు. అంతేకాకుండా ఇంతతక్కువ కాలంలో తనేంటో ప్రజలకు కమల నిరూపించుకోలేపోయారన్నది వాస్తవం.
ఈ ఫలితాన్ని ఊహించలేదు
వాషింగ్టన్, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తాయని తాను ఆశించలేదని డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్ అన్నారు. ఓటమి చెందిన మాత్రానా తన పోరాటాన్ని ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఓటమి చెందిన అనంతరం వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని, స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని అన్నారు.
ఫలితం ఎలా ఉన్నా దాన్ని అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. మనం చేసిన పోరాటంపై గర్వంగా ఉందని అన్నారు. దేశంపై ప్రేమ, సంకల్పం, తనపై ఉంచిన నమ్మకంతో తన గుండె నిండిపోయిందని భావోద్వేగంతో చెప్పారు. గెలవకపోయినా స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు.