16-04-2025 12:00:00 AM
రెండు రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లభించిన మృతదేహాలు
మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి డబల్ బెడ్ రూమ్ సమీపంలోని క్వారీలో నీరు అధికంగా నిలిచి పోయింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలవాసులు తరచుగా ఈ క్వారీలో నిలిచిన నీటిలో స్నానాలు చేస్తూ వస్తున్నారు. సోమవారం ఈ క్రమంలోనే దివిటిపల్లి డబల్ బెడ్ రూమ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు సోమవారం క్వారీలో ఈతకు వెళ్లారు.
అందులో ముగ్గురికి ఈత రాకపోవడంతో లోతును అంచనా వేయడంలో లోతైన ప్రాంతానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో ముందుగా ఒకరి పొగ మరొకరు అలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. క్వారీలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మునిగిపోయారని స్థానికులు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ గాంధీ నాయక్ కు సమాచారం ఇవ్వడంతో, సిఐ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించి, సహాయక బృందాల ద్వారా వారిలో మునిగిపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నం చేశారు.
గల్లంతయినవారిలో దివిటిపల్లికి చెందిన విజయ్ (32), మహబూబ్(30), అయ్యప్ప (16) లుగా గుర్తించారు. సోమవారం సాయంత్రం వరకు ఒకరి మృతదేహం లభించగా, మిగతా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఇద్దరి మృత దేహాలు మంగళవారం లభించినట్లు సిఐ తెలియజేశారు.
దీంతో ముగ్గురు మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మృతదేహాలను తరలించినట్లు సీఐ తెలిపారు. చెరువులు కుంటలు లకు ఈతలు కొట్టేందుకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఐ తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని పెద్దలు దగ్గరగా ఉండి ఆ అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ఈతలను నేర్పించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించడం అస్సలు మంచిది కాదని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని కోరారు. మృతుల కుటుంబాల ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.