calender_icon.png 12 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నుమాయిష్ వాయిదా

30-12-2024 03:19:36 AM

  1. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో రెండు రోజులు ముందుకు
  2. జనవరి 3న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29(విజయక్రాంతి): నగరవాసులలు ఎప్పుడెప్పుడా అని వేచిచూసే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతీ యేటా జరిగే నుమాయిష్(ఎగ్జిబిషన్) ఈసారి రెండు రోజుల పాటు వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించడంతో దేశవ్యాప్తంగా సంతాపదినాలు పాటిస్తున్నందున జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను రెండు రోజుల పాటు నిర్వాహకులు వాయిదా వేశారు.

ఈమేరకు ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గాంధీ సెంటినరీ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిది దశాబ్దాలుగా నుమాయిష్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఏడాది ఈ ఎగ్జిబిషన్‌ను 25లక్షల మంది సందర్శిస్తారన్నారు.

ఈసారి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారని, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్టాళ్లు కూడా ఎగ్జిబిషన్‌లో ఉంటాయని పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక స్టాళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. యశోద ఆస్పత్రి సహకారంతో 24గంటలు పనిచేసేలా వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఫండ్‌తో 20 విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కన్వీనర్ డీ సురేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు కే నిరంజన్, కోశాధికారి డా. బీ ప్రభశంకర్, జాయింట్ సెక్రటరీ డీ మోహన్, పబ్లిసిటీ సబ్ కమిటీ అడ్వైజర్ సురేష్‌రాజ్ పాల్గొన్నారు.