calender_icon.png 24 October, 2024 | 6:59 PM

సంయమనం పాటించండి

11-07-2024 01:12:18 AM

  1. ఫోన్‌ట్యాపింగ్ కేసు వార్తల్లో అప్రమత్తత
  2. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు హైకోర్టు సూచన
  3. న్యాయమూర్తుల కుటుంబాల వివరాలు..
  4. బహిర్గతం చేయటంపై అసహనం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై వార్తల ప్రచురణ, ప్రసారంలో సంయమనం పాటించాలని మీడియా కు హైకోర్టు బుధవారం సూచించింది. గతవారం పత్రికల్లో జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లను ప్రచురించినట్లు గుర్తించామని, ఈ వార్తల కవరేజీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నది. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఫోన్ల ట్యాపింగ్‌పై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం విధితమే.

ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడి న ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామన్నారు. కేంద్రం కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అయితే ఈ కేసు వార్తల కవరేజీలో మీడియా  సంయమనంతో వ్యవహరించాలని కోరింది. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.