21-04-2025 01:12:39 AM
మొదట దివ్యాంగులు, వితంతువులకు..
అమలు యోచనలో ప్రభుత్వం
త్వరలో సీఎం రేవంత్ చెంతకు ఫైల్ జపాన్ పర్యటన అనంతరం సీఎంతో మంత్రి సీతక్క భేటీ
ఆ తర్వాత మిగతా పింఛన్ల పెంపు?
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ‘రైతుభరోసా’ అమలు చేస్తున్నది. ‘గృహజ్యోతి’ ద్వారా గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నది. ఇటీవల యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇక ఇప్పుడు ఆరో గ్యారెంటీ అయిన ‘చేయూత’ వంతు వచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామనే హామీని నిలబెట్టుకొనేందుకు కసరత్తు ప్రారంభిం చింది. వృద్ధులను మినహాయించి ముందుగా వితంతువులు, దివ్యాంగుల పింఛన్లు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
సీఎంతో భేటీ కానున్న మంత్రి సీతక్క..
ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నా రు. సీఎం తెలంగాణకు చేరుకోగానే పింఛన్ల పెంపు ఫైల్ ఆయన టేబుల్‌పైకి చేరుకుంటుందని తెలిసింది. మంత్రి సీతక్క సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయి పింఛన్ల పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం.
వాస్తవానికి పింఛన్ల పెంపు రాష్ట్రప్రభుత్వానికి ఆర్థికభారమే. ప్రస్తుతం పింఛన్లకు సర్కా ర్ యేటా రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఒకవేళ పింఛన్ల పెంపు పూర్తిగా అమలైతే ఏడాదికి రూ.24 వేల కోట్ల సొమ్ము అవసరమవుతుంది. కొంతలో కొంత ఆర్థికంగా ఉపశమనం పొందేందుకు ప్రస్తుతానికి వృద్ధులను మినహాయించి వితంతువులు, దివ్యాంగుల వరకు పింఛన్లు పెంచాలనే నిర్ణయానికి సర్కార్ వచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలో పింఛనుదారుల సంఖ్య ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు 15.25 లక్షల మంది, వితంతువులు 15.26 లక్షల మంది, దివ్యాంగులు 4.92 లక్షల మంది, గీత కార్మికులు 0.63 లక్షల మంది, నేత కార్మికులు 0.36 లక్షల మంది, హెచ్‌ఐవీ పేషెంట్లు 0.35 లక్షల మంది, డయాలిసిస్ పేషెంట్లు 4 వేల మంది, ఫైలేరియా బాధితులు 18 వేల మంది, బీడి కార్మికులు 4.23 లక్షల మంది, ఒంటరి మహిళలు 1.41 లక్షల మంది, బీడి టేకేదార్లు 4 వేల మంది.
ఇలా మొత్తం నెలకు 42.67 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం వితంతువులకు నెలకు రూ.2,016 చొప్పున, అలాగే దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛను అందజేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘చేయూత’ పథకంలో భాగంగా వితంతువుల పింఛనను రూ.4 వేల, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది.
కాస్త.. హామీ అమలు కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఆ హామీని నెరవేర్చేందుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా పింఛను పథకం వర్తింపజేస్తుందని తెలిసింది. ఇక వృద్ధాప్య పింఛను పెంపు అంశాన్ని ఎప్పుడూ తేలుస్తుందో వేచిచూడాల్సిందే.
కొత్త పింఛన్లకు మార్గం సుగమం..
గత ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒక్క పింఛనైనా కొత్తగా మంజూరు కాలేదు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు పింఛన్లకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పింఛన్ దరఖాస్తులను పరిశీలించి, కొత్త వారికి కూడా పింఛను ఇస్తామని, అలాగే పింఛన్లు సైతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగానే కొత్త పింఛన్లు సైతం మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.