హైకోర్టులో భవన నిర్మాణ
కార్మికుల సంక్షేమ మండలి పిటిషన్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చినా మదింపు ఉత్తర్వులు జారీ చేయడంపై భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి హైకోర్టును ఆశ్రయించింది. మదింపు ఉత్తర్వులను నిలిపివేయాలంటూ సీబీడీటి ఆశ్రయించగా 20 శాతం డిపాజిట్ చేయాలని ఉత్తర్వులిచ్చే పరిధి ఆ సంస్థకు లేదని, వాటిని నిలిపివేయాలంటూ కార్మికుల సంక్షేమ మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ చట్టం కింద 2008లో కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటైందని, ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ 2017 నవంబరు 9న నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. దీంతో సంక్షేమ మండలి ఎలాంటి పన్ను చెల్లించడంలేదని, అయితే 2022 ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీచేసినా స్పందించకపోవడంతో ఫిబ్రవరి 27న పన్ను మదింపు ఉత్తర్వు జారీచేసిందన్నారు. దీనిపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాకస్స్ (సీబీడీటీ)ని ఆశ్రయించగా 20 శాతం డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఆదాయపు పన్ను శాఖకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.