ఈసీఐఎల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపుల వ్యవహారంలో ఈసీఐఎల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రాట్యుటీ యాక్ట్ మేర కు రిటైర్డ్ ఉద్యోగి లేదా ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబ వారసులు పొందే హక్కు గ్రాట్యుటీ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పుచెప్పారు. ఉద్యోగులు గ్రాట్యుటీ పెంచిన సీలింగ్‌కు అర్హులం టూ పీఎఫ్ అప్పీలెట్ అథారిటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. 2007 నుంచి 2010 మధ్యకాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వాళ్లకు గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి రూ.10 లక్షలుగా చెల్లించాలని పీఎఫ్ అప్పీలెట్ అథారిటీ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీళ్ల తరఫున న్యాయ వాది వాదిస్తూ.. ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ రూల్స్ ప్రకారమే చెల్లింపులు ఉండాలని, 2010లో గ్రాట్యుటీ యాక్ట్‌ని కేంద్రం సవరించి సీలింగ్ రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు.
ఈ కేసులోని ఉద్యోగులు 2010కి ముందే రిటైర్డ్ అయ్యారని, వాళ్లకు పెంపు వర్తించదని స్పష్టంచేశారు. ఈ వాదనలను ఉద్యోగుల తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వ్యతిరేకించారు. 2007 జనవరి 1 నుంచి రూ.3.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని బోర్డాఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేశాక.. 2010 నుంచి చెల్లిస్తామని చెప్పడం చట్ట వ్యతిరేకమన్నారు. పీఆర్‌ఎసీ సిఫార్సుల ప్రకారం 2008 నవంబర్ 26న కేంద్రం ఆఫీసు మెమోరాండం ప్రకారం కూడా ఆ ఉద్యోగులు అర్హులని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. ఇప్పటికే చెల్లించిన మొత్తం మినహా మిగిలిన నగదును వడ్డీతో కలిపి చెల్లించాలని అప్పీలేట్ అథారిటీ ఉత్తర్వులను ఆమోదిస్తూ తీర్పు వెలువరించింది.