calender_icon.png 4 October, 2024 | 8:52 AM

నా మాటలు మాఫీ పొరపాటున మాట్లాడిన

04-10-2024 02:43:05 AM

నా వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్నా

అక్కినేని కుటుంబాన్ని కించపర్చాలనే ఉద్దేశం లేదు 

కేటీఆర్ లీగల్ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తా 

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వెల్లడి 

హైదరాబాద్, అక్టోబర్ ౩ (విజయక్రాంతి)/హనుమకొండ: అక్కినేని కుటుంబం, నటి సమంతపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావటంతో మంత్రి కొండా సురేఖ వెనక్కు తగ్గారు. అక్కినేని కుటుంబాన్ని కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తన వాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు.

గురువారం ఆమె ఈ అంశంపై ట్వీట్ చేశారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని తెలిపారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. కేటీఆర్ తనను కించపర్చేలా మాట్లాడారని, అందుకు తాను ఆవేదనకు గురై మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు.

అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ కుటుంబం ట్వీట్లు చూసి తనకు బాధ కలిగిందని, తాను పడే బాధ వాళ్లు కూడా పడొద్దనే ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమంత స్వశక్తితో ఎదిగిన తీరు తనకు కూడా ఆదర్శమేనని తెలిపారు.

తన వ్యాఖ్యల పట్ల సమంతకానీ, ఆమె అభిమానులుకానీ మనస్థాపానికి గురైతే బేషరత్‌గా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అయితే కేటీఆర్ తన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.

తనతోపాటు మంత్రి సీతక్కను కూడా దారుణంగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలర్స్‌ను కేటీఆర్ దుబాయ్‌లో దాచిపెట్టారని, వాళ్లను తీసుకువచ్చి అప్పగిస్తే మంచిదని సూచించారు. సినీ పెద్దల స్పందన వెనుక బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

తెరపై డర్టీ పిక్చర్!

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఆమె ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నారు. తనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా అసభ్యంగా ట్రోల్ చేస్తున్నదని మంత్రి కొండా సురేఖ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, మరో 24 గంటలు గడిచిన తర్వాత ఒక స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలోకి దూరి ఆమెపై, ఆమె మాజీ భర్త కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ స్టార్ హీరోయిన్ భుజంపై గన్‌పెట్టి తన ప్రత్యర్థి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను షూట్ చేయాలని చూశారు.

కానీ ఆ గన్ మిస్ ఫైర్ అయ్యింది. మంత్రి సురేఖ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను యావత్ సమాజం ఖండించింది. టాలీవుడ్‌లో తారలు ముక్తకంఠంతో మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంలో తెలుగు చిత్రసీమ ప్రముఖులందరూ ఏకతాటిపైకి రావడం ఇక్కడి విశేషం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమా లోకమంతా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తన వ్యాఖ్యలను ఖండిస్తూ  వస్తున్న ప్రకటనలను చూసి దిగివచ్చిన ఆ ఆమాత్యురాలు ఎంతో మనస్థాపంతో చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుక్నుట్లుగా ప్రకటించారు. వాస్తవానికి నూలుపోగు దండతో మొదలైన వివాదానికి కారణమైన వ్యక్తిని మంత్రి సులభంగానే అరెస్ట్ చేయించవచ్చును.

కానీ ఒకరోజు సమ యం తీసుకొని ఆమె మీడియా ముందుకు వచ్చి నిరాధారమైన ఆరోపణలు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో రచ్చ చేయడం వెనుక మతలబు ఏమిటి అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. అలాగే ఆమె ఇద్దరు హీరోయిన్ల జీవితాలను ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలకు పక్కా ఆధారాలు ఉంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా చాలా సులభంగానే అరెస్ట్ చేయించవచ్చును.

కానీ మధ్యతరగతి కుటుం బం నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఉన్నతమైన స్థానానికి ఎదిగిన ఒక యువతి, ఆమె మాజీ భర్త కుటుంబంపై అసందర్భంగా ఆ మంత్రి ఆరోపణలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రైతురుణ మాఫీ జరగలేదు. రైతుభ రోసా అందలేదు.

ఉచిత బస్సు మినహా కాం గ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్నా ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీనికి తోడు రాష్ట్రంలో హైడ్రా, మూసీ కూల్చివేతలతో ప్రభుత్వానికి ప్రజలలో వ్యతిరేకత మొదలైంది.

ఈ ప్రజా వ్యతిరేకతను మరింత పెంచేలా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు సారధ్యంలో ప్రత్యక్ష పోరాటాలతో సిద్ధం కావడంతో గతవారం రోజులుగా ప్రతి మీడియాలో ప్రజాగ్ర హానికి సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం దక్కింది. అయితే డైవర్షన్ పాలిటిక్స్‌కు పెట్టిం ది పేరైన కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో మళ్లీ అదే తోవపట్టిందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

గొడ్డలి పట్టినోడు.. గొడ్డలికే బలి అవుతాడన్న చందంగా ఏ సోషల్ మీడియా పోస్టుతో తాను ఇబ్బంది పడిందో, అదే సోషల్ మీడియా ద్వారా సమాజంలోని అన్నివర్గాల నుంచి ఆ మంత్రి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. లీగల్ నోటీసుల దాకా విషయం వెళ్లినా.. మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై మాత్రం తాను వెనక్కి తగ్గేదే లేదు అని మంత్రి సురేఖ అంటున్నారు.

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చాలా సున్నితమైన అంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఏమి జరిగితే మాకేంటిలే అనుకుంటే ఆ రెండు పార్టీల ఇమేజ్ డ్యామెజ్ అవడం ఖాయం. చివరగా ఓ ఎంపీ వేసిన నూలు పోగు దండతో మొదలై స్టార్  హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలపై నిందల నుంచి కోర్టు గడప వరకు చేరిన ఈ వ్యవహారం వెళ్లింది. మున్ముందు ఇంకెంత దూరం పోతుంది అనేది వేచి చూడాలి.

* గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. చిత్ర పరిశ్రమ వ్యక్తులపై ఇలాంటి దాడులను మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారొద్దు. 

చిరంజీవి 

* ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలి.

వెంకటేశ్ 

* కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ఇతరులు మాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు.   

ఎన్టీఆర్ 

* మా సినీ కుటుంబ ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా.. ఒక భార్యకు భర్తగా.. ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి.  ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా.

మహేశ్‌బాబు   

* సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. 

అల్లు అర్జున్ 

* రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం నన్ను భయాందోళనకు గురిచేసింది. ఇది అవమానకరమైన చర్య. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లాగకూడదు. రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిగా నిలవాలి.

రవితేజ 

* రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది సినిమా నటులు, రాజకీయ పార్టీల అంశమే కాదు. సమాజంలో చెడు ప్రభావాన్ని చూపే  చర్యలను అంతా ఖండించాలి.

నాని 

* మా పరిశ్రమ ఇతర రంగాల మాదిరిగానే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తోంది. కానీ ప్రజా, లేదా రాజకీయ లాభాల కోసం అవాస్తవ కథనాలను వాడటం చాలా నిరాశ కలిగిస్తోంది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. మిగతా అందరి కుటుంబాల్లాగే మాకూ గౌరవం, రక్షణ అవసరం.  

మంచు విష్ణు 

* అందమైన తెలుగు ఇండస్ట్రీలో నాది గొప్ప ప్రయాణం. ఇప్పటికీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. ఒక మహిళ గురించి దారుణమైన ఆరోపణలు బాధగా అనిపించింది. హుందాగా వ్యవహరించా లనే నిశబ్దంగా ఉన్నాం. అదే మా బలహీనత అనుకోవద్దు. నేను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని. రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరును ఉపయోగించుకోవద్దు.

రకుల్ ప్రీత్ సింగ్ 

* నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏమాత్రం సహించకూడదు. 

 రామ్‌గోపాల్ వర్మ 

* అక్కినేని నాగార్జున కుటుంబంపై రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం శోచనీయం. రాష్ట్రాలకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకువచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడటం తప్పు. సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే.. దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిందీ మీదే.

హరీశ్ శంకర్ 

* మంత్రి సురేఖ మాట్లాడిన పరుషమైన, అనవసరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారంలో ఉన్న మహిళ ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కానిది. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం.

వరుణ్ తేజ్ 

* ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక కుటుంబం గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో తప్పు. ఒక స్త్రీ గురించి మరో స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. విజ్ఞులైన మీరు పెద్ద మనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. 

 లావణ్య త్రిపాఠి 

* రెండు నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేనివారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ, ఇక్కడ ఒక మహిళకు జరిగిన అవమానాన్ని చూస్తున్నా. కొండా సురేఖ గారు ఇలా ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి.  దేశంలో ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు.. మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము. 

ఖుష్బూ 

* తాజా పరిణామాలపై నా భావాలు, ఆలోచనలు వ్యక్తపర్చడానికి చాలా కష్టంగా ఉంది. రాజకీయ నాయకులారా.. మీకు ఓటు వేసి గెలిపించినందుకు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై మాట్లాడి, సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ప్రగతిపథంలో నడపాలని గుర్తు చేస్తున్నా. 

విజయ్ దేవరకొండ 

* జీవితంలో విడాకుల నిర్ణయం అత్యంత బాధాకరం, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం విడాకులు తీసుకున్నాం. మంత్రి సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం. సినీ ప్రముఖుల జీవితాలను మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు.

నాగచైతన్య