09-04-2025 10:38:45 PM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు..
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు మంజూరు చేయడంలో విశేష కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కామేష్ మాట్లాడుతూ... దేశంలో మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడం హర్షనీయమన్నారు. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేదని, కొత్తగూడెంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయన్నారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుందన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రాబోతుందని విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తుతోపాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుమ్మల భవిష్యత్తులో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇదే విధంగా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, రాయరాకుల శివ శంకర్, పూణెం మురళి తదితరులు పాల్గొన్నారు.