calender_icon.png 31 October, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూల్‌పేట్‌పై ఎక్సైజ్ నిఘా

18-07-2024 02:59:36 AM

  • అధికారుల విస్తృత తనిఖీలు 
  • డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంపై చర్యలు 
  • ప్రజల్లో మార్పుకోసం ఎక్సైజ్ శాఖ యత్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): నాటుసారా, డ్రగ్స్ రహిత హైదరాబాద్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నగరంలోని ధూల్‌పేట్‌పై ప్రత్యేదృష్టి పెట్టారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వినియోగానికి ధూల్‌పేట అడ్డాగా మారిందనే ఆరోపణలుండడం, పలుమార్లు ఇక్కడికి చెందిన పలువురు డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ధూల్‌పేట్‌లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్నేండ్ల క్రితం వర కు ఇక్కడ నాటుసారా తయారీ కేంద్రాలున్న విషయం తెలిసిందే. నాటుసారా తయారీ, అమ్మకం, వినియోగం నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ధూల్‌పేట్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా అవుతోందనే ఆరోపణలున్న నేపథ్యంలో నిఘా పెడుతున్నారు. 

యువతకు కౌన్సిలింగ్

ధూల్‌పేట్‌లో నివాసముంటే ఎక్కువ మంది ప్రజలు కొన్నేండ్ల క్రితం వలస వచ్చి న వారే. గణేష్ విగ్రహాలు, దుర్గామాత, ఇత ర విగ్రహాల తయారీయే వీరి జీవనాధారం. అయితే వారిని గతంలో నాటుసారా,  ప్రస్తు తం గంజాయి పట్టి పీడిస్తున్నాయి. ధూల్‌పేటలోని ఐదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు ఏడు లక్షల మంది నివాసముంటున్నారు. ఇక్కడి ప్రజలను గంజాయి, డ్రగ్స్ నుంచి విముక్తి చేసేందుకు ఎక్సైజ్ , పోలీసు శాఖల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, అమ్మడం, రవాణా చేస్తే ఎదుర్కోవాల్సిన కేసుల పట్ల అవగాహన కల్పించా రు. ముఖ్యంగా యువతకు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. 

ఎక్సైజ్, డీటీఎఫ్ బృందాలతో ఇళ్లల్లో సోదాలు

ధూల్‌పేట్‌లో కొందరు గంజాయి, డ్రగ్స్ ను విక్రయించడం, రవాణా చేయడంతో పాటు వాటికి బానిసగా మారుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వాటి నుంచి విముక్తి చేయడానికి ప్రత్యేక దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ధూల్‌పేటలో ఈ నెల 13న 8 బృందాలతో, మంగళవారం 120మంది సిబ్బందితో ఎక్సైజ్, డీటీఎఫ్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఇళ్లల్లో సోదాలు నిర్వహించి అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా ఎక్సైజ్ అధికారుల కళ్లు గప్పి పలువురు తప్పించుకుంటున్నట్లు తెలుస్తున్నది. 

గంజాయి అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్

ధూల్‌పేట్‌లో గంజాయి అమ్ముతు న్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.6కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. బుధవారం ఎస్‌టీఎఫ్ పోలీసులు ఎస్సై సాయికిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో దత్తాత్రేయనగర్, ఆసిఫ్‌నగర్, అప్పర్ ధూల్‌పేట్‌లో తనిఖీలు నిర్వహించారు. అనురాజ్‌బాయి(అనితబాయి), పప్పారామ్ అనే వ్యక్తుల ఇంట్లో గంజాయిని దాచి ఉంచినట్లు గుర్తించి, గంజాయితో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేట్‌కు చెందిన సుభాష్‌సింగ్ అనే వ్యక్తి నుంచి తీసుకువచ్చి ధూల్‌పేట్ లో అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. 

ప్రజలు సహకరించాలి

డ్రగ్స్, గంజాయి అమ్మకం, రవాణా, వినియోగంపై ఎక్సైజ్ శాఖ నిఘాపెట్టింది. వాటిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలకు ధూల్‌పేట్ ప్రజలు సహకరించాలి. గం జాయిని తుదముట్టించేంత వరకు దాడులు జరుపుతాం. గంజాయి, డ్రగ్స్ సమాచారాన్ని 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌లో సమాచారం అందించాలి.   

 -కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్