- దావత్‌లకు అనుమతులు తప్పనిసరి
- నిర్లక్ష్యం వహిస్తే కేసులు, జరిమానాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18(విజయక్రాంతి): నగరవాసులు వేడుకలు, ఈవెంట్లకు నగర పరిధిలోని ఫామ్‌హౌస్‌లను ఆశ్రయిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మద్యాన్ని వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌసుల్లో జరుగుతున్న వేడు కలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది.
వేడుకల్లో వినియోగించే మద్యానికి అను మతి తప్పనిసరిగా ఉండాలని సూచిస్తోంది. వేడుకలకు సైతం ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొంటుంది. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.
పెడచెవినపెడితే అంతేసంగతి
నగర శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్ ప్రాంతాల్లో వందలాది బంకెట్ హాల్స్, కన్వెన్షన్లు, క్లబ్‌హౌజులు, ఫామ్‌హైస్‌లు, ఫంక్షన్‌హాళ్లు ఉన్నాయి. వీటిల్లో నిత్యం ఏదో వేడుక జరుగుతోంది. ఈ వేడుకల్లో మద్యం వినియోగానికి ముందస్తు అనుమతులు తప్పనిసరని ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌ల యాజమాన్యాలకు ఎక్సైజ్ అధికారులు పలుమార్లు సూచనలు చేశారు.
అయినా ఆయా యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నారని తెలుస్తోంది. పలు చోట్ల నాన్‌డ్యూటీపెయిడ్ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పలు చోట్ల ఆకస్మికదాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులకు అనుమతులు తీసుకోకుండా మద్యాన్ని వినియోగిస్తున్న ఘటనలు ఎదురవుతున్నాయి.
దీంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా మద్యాన్ని వినియోగించే ఫామ్‌హౌస్, ఫంక్షన్‌హాళ్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు, నిర్వాహకులకు జరిమా నా విధించడంతో పాటు, కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
చేవెళ్లలోని అరవిల ఫామ్‌హస్‌లో గతేడాది అనుమతి లేకుండా మద్యం వినియోగిస్తుండగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మొదటి తప్పుగా భావించి ఆ ఫామ్‌హౌస్ యజమానులను ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశారు. అదే ఫామ్‌హౌస్‌యాజమాన్యం మరోసారి అనుమతి లేకుండా మద్యం వినియోగానికి అనుమతించి మరోసారి అధికారులకు దొరికారు. దీంతో వారికి రూ.లక్ష జరిమానా విధించారు.
బ్లాక్ లిస్ట్‌లో పెడుతాం
ఫామ్‌హౌజులు, ఫంక్షన్‌హాళ్లు, క్లబ్‌హౌజులు, కన్వెన్షన్స్, రి సార్ట్‌ల్లో మద్యం పార్టీ లు నిర్వహించాలనుకునే వారు ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాలి. ఫంక్షన్ నిర్వాహకులు మరిచిపోయినా ఆయా యాజమాన్యాలు అనుమతి తీసుకోవా లి. మద్యం వినియోగానికి అనుమతులు లేకుంటే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. ఆ హాళ్లను బ్లాక్ లిస్ట్‌లో పెడుతాం.
కృష్ణప్రియ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంషాబాద్