calender_icon.png 23 January, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దూకుడు

05-07-2024 12:41:57 AM

  • డ్రగ్స్, నాటుసారా నియంత్రణే లక్ష్యంగా వరుస దాడులు 
  • ఒక్క నెలలోనే 1901 కేసులు నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి) : డ్రగ్స్ నియంత్రణ, నాటుసారా తయారీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దూకుడు పెంచారు. ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో నాటుసారాను పూర్తిగా నిర్మూళిస్తామని వారు స్పష్ట చేస్తున్నారు. డ్రగ్స్ రవాణా, నాటుసారా తయారీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, నిందితులను పట్టుకోవడంతో పాటు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశాల మేరకు డ్రగ్స్ విక్రేతలను పట్టుకుంటూ డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం, తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

జూన్‌లో 1901 కేసులు నమోదు..

నాటుసారా తయారీ, విక్రయదారులపై గత సంవత్సరం మొత్తం 1,182 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ నెలలోనే 1901 కేసులు నమోదయ్యాయి. ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం తెలంగాణలో ప్రధానంగా ఆరు జిల్లాల్లో 26 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాటుసారా తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా జూన్‌లో ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో 8,716లీటర్ల గుడుంబా, 20,158 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 77 నాటు సారా తయారీ బట్టీలను, 1,91,850 లీటర్ల బెల్లం పానకాన్ని  ధ్వంసం చేశారు.

3,307కిలోల బెల్లం, 215 వాహనాలను సీజ్ చేశారు. దీనికి తోడు నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం రవాణాపై కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. వివిధ సందర్భాల్లో దాడులు నిర్వహించి సుంకం చెల్లించని మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఇతర ప్రాంతాలలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని తీసుకువచ్చి వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఎక్సైజ్ శాఖ నిర్వహించే దాడుల్లో ఇది స్పష్టం అవుతోంది. జూన్‌లో పలుచోట్ల నిర్వహించిన దాడుల్లో 2,937 లీటర్ల నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని, 3,334 లీటర్ల బీర్లను పట్టుకున్నారు. 36 మందిని అదుపులోకి తీసుకోగా 78 కేసులు నమోదు చేశారు. 

డ్రగ్స్ విక్రేతలపై 155 కేసులు 

హైదరాబాద్ సహా పలు జిలాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం, విక్రయంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టి సారించింది. ఆ శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో భారీగా డ్రగ్స్, విక్రేతలు పట్టుబడుతున్నారు. వాటికి తోడు గంజాయి రవాణాదారులు కూడా పట్టుబడుతున్నారు. గత సంవత్సరం 181 డ్రగ్స్ కేసుల్లో 302 మందిపై కేసులు నమో దు చేయగా.. ఒక్క జూన్ నెలలోనే డ్రగ్స్ విక్రేతలు, రవాణాదారులపై ఎక్సైజ్ అధికారులు 155 కేసులు నమోదు చేశారు. 

నాటుసారాను నివారిస్తాం

ఆగస్టు నెలాఖరు నాటికి నాటుసారాను పూర్తిగా నివారిస్తాం. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆ బృందాలతో దాడులు నిర్వహిస్తున్నాం. డ్రగ్స్ క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. డ్రగ్స్‌ను పూర్తిగా తుదముట్టించడమే లక్ష్యం గా పనిచేస్తున్నాం. నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసులు పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.

 -కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్