calender_icon.png 28 September, 2024 | 10:50 AM

20 శాతం తగ్గిన ఎక్సైజ్ సుంకాలు

28-09-2024 02:24:18 AM

భారీగా పెరిగిన కేంద్ర గ్రాంట్లు

అప్పులో 39 శాతం వడ్డీలకే..

తెలంగాణ ఆగస్టు నివేదికను వెల్లడించిన కాగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): రాష్ట్రంలో ఆగస్టు నెలలో ఎక్సైజ్ సుంకాలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే.. దాదాపు 20 శాతానికి తగ్గినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన ఆగస్టు నెల ఆర్థిక నివేదికను శుక్రవారం కాగ్ ప్రకటించింది.

ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గతేడాది ఆగస్టులో ఎక్సైజ్ సుంకాలు బడ్జెట్ అంచనాల్లో 51.04 శాతం వసూలు కాగా.. ఈసారి కేవలం 30.48 శాతం మత్రమే ఖజానాకు వచ్చినట్లు కాగ్ చెప్పింది. అలాగే, రెవెన్యూ రాబడుల్లో కూడా భారీగా వ్యత్యాసం కనిపించింది. ఈసారి రెవెన్యూ రాబడుల బడ్జెట్ అంచనాలు రూ.2,21,242.23 కోట్లు ఉండగా.. ఆగస్టు నాటికి రూ. 61,618.6 కోట్లు వసూలయ్యాయి.

ఇది బడ్జెట్ అంచనాల్లో 27.85శాతం కాగా.. గతేడాది ఇదే నెలలో 33.68 శాతం రాబడులు రావడం గమనార్హం. అంటే ఈ సారి దాదాపు 5 శాతం రాబడులు తగ్గాయి. ఇదిలా ఉంటే.. రెవెన్యూ వ్యయం కూడా గతేడాదితో పోలిస్తే.. దాదాపు 2 శాతం ఖర్చు తగ్గింది. 

5 శాతం పెరిగిన కేంద్ర గ్రాంట్లు.. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు నాటికి కేంద్రం రాష్ట్రానికి రూ.2447.03 కోట్లను మంజూరు చేసింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11.31శాతం కావడం విశేషం. గతేడాది ఇదే సమయానికి కేంద్రం బడ్జెట్ అంచనాల్లో కేవలం 7.29 శాతం మాత్రమే విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. జీఎస్టీ వసూళ్లలో వ్యవత్యాసం భారీగా తగ్గింది. జులై  నెలలో గతేడాదికి, ఈ ఏడాది జీఎస్టీ వసూళ్ల తేడా దాదాపు 5 శాతం ఉండగా.. ఆగస్టులో ఆ తేడా 1.82 శాతానికి తగ్గింది.

అప్పులు తగ్గినా.. తప్పని వడ్డీల భారం

తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతినెల అప్పులను తగ్గించుకుంటూ వస్తోంది. ఆగస్టు నాటికి బడ్జెట్ అంచనాల్లో 59.79 శాతం  అప్పులను ప్రభుత్వం చేసింది. గతేడాది ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో 68.42 శాతం అప్పులను చేసింది. గతేడాది కంటే.. దాదాపు 8.63 శాతం తక్కువ రుణాలను ప్రభుత్వం తీసుకున్నట్లు కాగ్ చెప్పింది.

గత సర్కార్ చేసిన అప్పుల భారం కాంగ్రెస్ సర్కార్‌పై పడుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు పెరుగుకుంటూ పోతున్నాయి. ఆగస్టు నెలలో ప్రభుత్వం రూ.5886.21కోట్ల అప్పు చేస్తే.. ఇందులో దాదాపు 39 శాతం అంటే.. 2304.71కోట్లు వడ్డీలకే చెల్లించడం గమనార్హం.

  1. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా భారీగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికి బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం కేవలం 4.12 శాతం మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 63.50 శాతం రావడం గమనార్హం. అంటే ఏకంగా 59 శాతం నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది.
  2. రాష్ట్రంలో ఆగస్టులో రెవెన్యూ లావాదేవీలు పెరిగినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ల్యాండ్ రెవెన్యూ దాదాపు 4 శాతం పెరిగింది. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడులు గతేడాది ఆగస్టులో 31.63 శాతం వస్తే.. ఈసారి 35.06 శాతానికి పెరిగాయి.
  3. క్యాపిటల్ వ్యయంలో భారీగా వ్యత్యాసం కనిపించింది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో 49.12 ఖర్చు కాగా.. ఈ ఏడాది కేవలం రూ.24.87 శాతం మాత్రమే వెచ్చించడం గమనార్హం.
  4. ద్రవ్యలోటు గతేడాది ఆగస్టు నాటికి బడ్జెట్ అంచనాల్లో 46.66 శాతం ఉండగా.. ఈసారి అది 59.79 శాతానికి పెరిగింది.