గతంలో కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు చేశారు
నన్నూ ఒక సెషన్ మొత్తం సభ నుంచి సస్పెండ్ చేశారు
ఇప్పుడు మేం ప్రజాస్వామ్యంగా సభను నడుపుతున్నాం
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత అర్థవంతంగా చర్చ జరగలే
ప్రజా సమస్యలు పట్టని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?
సబితక్కకు సభలో అన్యాయం జరిగితే కేసీఆర్, హరీశ్ ఎక్కడికెళ్లారు
మోసం అనే పర్యాయ పదానికి సబితక్క అని డిప్యూటీ సీఎం చెప్పారు
నన్ను 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.. వారు కాంగ్రెస్‌లో చేరారా?
మీడియాతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ‘గడిచిన పదేళ్లతో పోల్చితే ఇప్పుడు అసెంబ్లీని మేము ప్రజాస్వామికంగా నడుపు తున్నాం. సభలో అధికార పక్ష సభ్యుల కంటే విపక్ష పార్టీల సభ్యులకే ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చినా.. అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీలో ఇంత సుదీర్ఘ చర్చలు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడు జరగలేదు.. ఒక్కో రోజు 17 గంటల పాటు సభ జరిగింది.
సభలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్ అవసరం రావొద్దని మా ఆలోచన. ఎవరైనా సభలో అతిగా ప్రవర్తిస్తే సందర్భానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అవసరాన్ని బట్టి కొందరి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావచ్చు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తన చాంబర్‌లో సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ సభ్యులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభలో లేచి నిలబడితేనే సభ్యత్వాలు రద్దు చేశారని గుర్తు చేశారు.
గతంలో తననూ ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. తన నియోజక వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాడు హైకోర్టులో పిటిషన్ కూడా వేశానని తెలిపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి గందర గోళం సృష్టిస్తున్నారని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారనే విషయాన్ని మీడియా ప్రస్తావించగా, తన వద్దకు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని సీఎం సమాధానమిచ్చారు. కృష్ణమోహన్‌రెడ్డి వాళ్లతో కలిసి టీ తాగి ఉండొచ్చని అని తెలిపారు.
సబితక్కకు అన్యాయం జరిగితే కేసీఆర్, హరీశ్‌రావు ఎటుపోయారు?
శాసన సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితఇంద్రారెడ్డికి అన్యాయం జరిగితే.. ఆమె ఇంత ఆవేదన చెందితే కేసీఆర్, హరీశ్‌రావు ఎటు పోయారు? అసెంబ్లీకి రాకుండా ఎందుకు డుమ్మా కొట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు సభకు వచ్చి అండగా నిలబడాలి కదా! తమ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా కేసీఆర్ ఎందుకు పత్తా లేకుండాపోయాడని ఎద్దేవాచేశారు. సభలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్‌రావు చాలనుకుంటే కేసీఆర్‌ను ఎందుకు ప్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు? ఆయన్ను ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
కేసీఆర్‌కు అధికారమే కావాలి.. ప్రజల పట్ల బాధ్యత లేదు
కేసీఆర్‌కు బాధ్యత, రాష్ట్రం పట్ల పట్టింపు లేదని.. ఆయనకు కేవలం అధికారమే కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన లేదు అని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకునే మంచి అలవాటు కేసీఆర్‌కు ఏనాడూ లేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ముగ్గురే సభలో 6 గంటలు మాట్లాడారని సీఎం తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ముగ్గురం కలిసి అంతసేపు మాట్లాడలేదని గుర్తుచేశారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణలోనూ ఎమ్మెల్యేగా పనిచేశానని.. కానీ, ఇప్పుడు జరిగినట్టు అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామికంగా, బాధ్యతాయుతంగా గతంలో జరగలేదని స్పష్టంచేశారు. చర్చను తప్పుదో పట్టించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించినా తాము బాధ్యతగానే వ్యవహరించామని పునరుద్ఘాటించారు.
పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై అందరికీ మాట్లాడే అవకాశం
ఈసారి బడ్జెట్ సమావేశాలు తక్కువ రోజులేం జరగలేదని.. బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపైన అందరికీ మాట్లాడే అవకాశం దొరికిందని, వీలైనంత చర్చ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఉండే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలోనే చెప్పామని గుర్తుచేశారు. కేంద్రం జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అందుకే 25న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. జూలై 31లోపు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందటం తప్పనసరి కాబట్టి, అందుకే సభ తక్కువ రోజులు నడిచినట్టుగా అనిపించిందని అన్నారు. రోజుకు 3 నుంచి 5 గంటలు సభ నడిపిస్తే వారం రోజులు సభ జరిగినట్లేనని చెప్పారు. ఒక్కో రోజు 17 గంటలు సభ నడిచిందని, ఎన్ని రోజుల కంటే ఎంత సమయం చర్చ జరిగిందనేది ముఖ్యమన్నారు.
సునితక్క కోసం ప్రచారం చేస్తే రెండు కేసులు
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునితక్క కోసం నర్సాపూర్ నియోజక వర్గంలో ప్రచారానికి వెళ్తే కౌడిపల్లి, నర్సాపూర్‌లో తనపై రెండు కేసులు పెట్టారని, ఇప్పటికీ కేసులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సునితక్క అధికార బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిందని, వాళ్ల కోసం ప్రచారం చేసిన తమ్ముడి మీద ఉన్న కేసులు తీయాలా.. వద్దా? మహిళా కమిషన్ పోస్టు తీసుకుని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిపోతే సరిపోతుందా? అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లోకి రమ్మని సబితక్కే పార్టీ మారింది
అక్కల మాటలు నమ్మి నేను మోసపోయానని కేటీఆర్‌కు చెప్పానని, కానీ, సభలో వారి పేర్లను ప్రస్తావించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రి సీతక్కను కూడా అక్క అని పిలుస్తానని స్పష్టంచేశారు. సభలో తాను మాట్లాడిన దాంట్లో అన్‌పార్లమెంటరీ పదం లేదని, ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదని చెప్పారు. సబితక్కకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని అన్నారు. సబితక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడినందుకే.. తాను మిగతాది పూర్తి చేశానని తెలిపారు. ‘నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబితక్క.. నాకు అండగా నిలవాల్సింది పోయి.. పార్టీ మారింది. నా ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పిన అక్క.. నేను మల్కాజిగిరిలో ఎంపీగా నామినేషన్ వేసేటప్పటికే నాకు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు ’ అని సీఎం అన్నారు. మోసం అనే పదానికి పర్యాయపదం సబిత అని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని సీఎం పేర్కొన్నారు.