07-02-2025 12:31:24 AM
* తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
* ఈ ‘సారీ’ బోల్తాపడ్డ ఇంగ్లండ్
* 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇండియా
* విఫలమైన ఇంగ్లిష్ బ్యాటర్లు
* గిల్, అయ్యర్ హాఫ్ సెంచరీలు
* నిరాశపర్చిన రోహిత్
నాగ్‌పూర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేసింది. కేవలం 248 పరుగులు మాత్రమే చేయడంతో భారత్‌కు సులభం అయింది.
ఇంగ్లిష్ బ్యాటర్లలో ఓపెనర్లు సాల్ట్ (43), డకెట్ (32), బట్లర్ (52), బెతెల్ (51) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్ల జోరు చూస్తే అసలు ఇంగ్లండ్ 200 మార్కును క్రాస్ చేస్తుందా? లేదా అనే అనుమానం కలిగింది. కానీ చివర్లో బెతెల్ అర్ధ సెంచరీ చేయడం, టెయిలెండర్ ఆర్చర్ (21) పరుగులు జోడించడంతో ఇంగ్లిష్ జట్టు 248 పరుగుల గౌరవప్రద స్కోరు చేయగల్గింది.
భారత బౌలర్లలో హర్షిత్ రానా, జడేజా చెరి మూడు వికెట్లు తీసుకోగా, షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ నేలకూల్చారు. జడేజా వన్డేల్లో 600 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. అర్ధ సెంచరీతో రాణించిన గిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
రోహిత్ మరో ‘సారీ’
గత కొద్ది రోజులుగా ఫామ్ లేక తంటాలు పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. కొత్త కుర్రాడు మహమూద్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ (87), తర్వాత వచ్చిన అయ్యర్ (59) తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (52) కూడా అర్ధ సెంచరీలు చేయడంతో భారత్‌కు విజయం నల్లేరు మీద నడకలా మారింది. ఓపెనర్లు విఫలం అయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో భారత్ ఘన విజయం సాధించింది.
చివర్లో టపటపా
220 పరుగుల వరకు భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాటర్లు కూడా అర్ధ సెంచరీలు చేసి జోరుమీదున్నారు. ఇక భారత్ ఘన విజయం సాధించడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ కొద్ది సేపట్లోనే పరిస్థితి మొత్తం తారుమారయింది. 221 వద్ద నాలుగో వికెట్‌గా అక్షర్ పటేల్ వెనుదిరగ్గా.. 235కే ఆరు వికెట్లు పడ్డాయి. దీంతో మన గెలుపు సమీకరణం మారింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1 ఆధిక్యంలోకి వెళ్లింది.