calender_icon.png 16 January, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది రూపాయలతో పరీక్ష

21-12-2024 12:00:00 AM

నేను బిఓఎల్ పరీక్షకు రెండేళ్లు చదివి యూనివర్సిటీ ఫస్టు వచ్చాను. కానీ, అది బీఏతో సమానం కాదు. ఎంఏ చేయడానికి కూడా వీలుండదు. అందుకోసం ఆంగ్లం (ఫస్ట్ పార్ట్)లో పాస్ కావాల్సిందే. ప్రాచ్య విద్యార్థులకు ఆంగ్లం అంటే అంతగా రుచించదు. కానీ, ఆంగ్లంలో ఉత్తీర్ణులైతేనే పట్టభద్రులౌతారు. ఒకరోజు ఆచార్య రవ్వా శ్రీహరి నాకీ విషయాలు చెప్పా రు. అంతేకాదు, ప్రాచ్య విద్యార్థులు ఎంఏలో ఫస్టు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనీ ఉద్బోధించారు. వారి మాటలు నామీద బాగా పనిచేశాయి. 

కానీ, అప్పటికి నేను బీఓఎల్ మాత్రమే ఉత్తీర్ణుడై ఉన్నాను. ‘బీఏ ఆంగ్ల పరీక్షకు ఎట్లా కూర్చోవాలి? ఏ పుస్తకాలు చదవాలి?’ అని సందేహిస్తుండగా, ఒక రిటైర్డ్ సైనికునితో పరిచయమైంది. ఆయనకూడా నాతోపా టు ఓల్డ్ సిటీలో ఉండేవాడు. పరీక్ష ఎప్పుడు రాయా లో చెబుతానన్నాడు. కానీ, తీరా ఆ విషయం మర్చిపోయాడు. అప్పుడు ఎగ్జామినేషన్ బ్రాంచిలో ఆచార్య ముదిగంటి గోపాలరెడ్డి పరీక్షల ముఖ్యకార్య నిర్వహణాధికారిగా ఉన్నారు.

వారి దగ్గరికి వెళ్లి అడిగాను. ఆయన నాకు ముందే పరిచయం. అప్పట్లో ఆచార్య గోపాలరెడ్డి ఓయూ సంస్కృత శాఖలో పనిచేసేవారు. వారు తరచుగా సంస్కృత విద్వాంసులైన గుండేరావు హర్కారే దగ్గరకు వచ్చేవారు. అప్పుడు నేనుకూడా గుండేరావు దగ్గర కనిపించేసరికి నన్ను పలకరించేవారు.‘బాగా చదువుకోండి’ అనే వారు. “బీఏ ఆంగ్లం (రెండు పేప ర్లు) పరీక్ష రాయాలని వచ్చాను సార్. పరీక్ష రుసుము కట్టే తేదీ నిన్నటికే ముగిసిందట..?” అన్నాను వారితో.

“అవును, ఆఖరు తేదీ ఐపోయింది. అపరాధ రుసుముతో కూడా. ఐనా, ఇబ్బంది లేదు. రెండింతలు రుసు ము కడితే పరీక్షకు కూర్చోవచ్చు” అన్నారు ఆచార్య గోపాలరెడ్డి. ఆ మాటలు వినగానే నాకు కొండంత ధైర్యం వచ్చింది. పరీక్ష రుసుము రూ.25కు బదులు రూ.50 రూపాయలు కట్టాలి. కానీ, నా జేబులో నలభై మాత్రమే ఉన్నాయి. 

ఆ ఋణం తీర్చుకోలేనిది

ఆచార్యుల వారికి కృతజ్ఞతలు చెప్పి బయటికి వచ్చా ను. వరండాలో ఒకతను నాలాగే ఇబ్బంది పడుతున్నా డు. “రెండింతలు రుసుము కట్టాలన్న” విషయం అతనికి చెప్పాను. అతనెంతో సంతోషించిండు. ఈ సంవ త్సరం పరీక్ష రాయక పోతే మళ్లీ ఒక ఏడాది దాకా ఆగవలసి వస్తుంది. అందుకే, ఈసారి ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలన్న అతని కోరిక కూడా నాలాగే తయారైంది. అప్పుడు నేను అతనితో అన్నాను, వినయంగా “మిత్రమా! నేనూ పరీక్షకు ఫీజు కట్టాలి. కానీ, నా దగ్గర ౪౦ రూపాయలే ఉన్నాయి. నువ్వో పది  ఇవ్వగలవా?.. మళ్లీ నీకు ముట్టచెబుతాను..”. 

“ఏం ఫరవాలేదు. నేను మీకు పది రూపాయలు ఇస్తాను. ఐతే, మీతోపాటు నేను కూడా పరీక్ష రుసుము చెల్లిస్తాను..” అని నాతోపాటు వచ్చాడు. ఇద్దరం రుసుము చెల్లించి, ఆ తర్వాత కలిసి ఆచార్య గోపలరెడ్డి వారి దగ్గరికి వచ్చాం. 

“బాగుంది, ఒకరి కొకరు తోడయ్యారన్నమాట. సరే, మీకు అనుమతి ఇస్తున్నాను..” అన్న ఆయన మాటలతో మాకెంతో సంతోషం కలిగింది. అలా ఫీజు కట్టి ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. తర్వాత 1978లో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రవేశ పరీక్ష రాయడానికి అవకాశం లభించింది. అంతేకాదు, బషీర్‌బాగ్ పీజీ కళాశాలలో ఎంఏ తెలుగులో ప్రవేశమూ లభించింది. ఆ సమయంలో తెలుగుశాఖలోని ఉద్ధండ పండితులు అందరూ పిజీ సాయం కళాశాలలో ఉండ డం విశేషం.

వారి అధ్యాపనంలో తెలుగులో అందరికంటే మిన్నగా మార్కులతో 1980లో యూనివర్సిటీ ఫస్టు ర్యాంకు తెచ్చుకున్నాను. అయితే, నాకు పది రూపాయలు ఇచ్చి సహాయపడిన ఆ వ్యక్తి తర్వాత మళ్లీ కనిపించలేదు. కనిపిస్తే ఆయన డబ్బు ఆయనకు ఇద్దామనే అనుకున్నాను. ఆర్థిక సహాయం చిన్నదైనా, పెద్దదై నా ఒక్కోసారి ఎంతగానో విలువ చేస్తుంది. ఆ ఏడాది నేను బీఏ (ఆంగ్లం) ఉత్తీర్ణుడను కాకపోయి వుంటే ఏమయ్యేదో ఊహించలేను.

ఆచార్య మసన చెన్నప్ప

 వ్యాసకర్త సెల్: 9885654381